Mar 04,2023 00:10

కందమామిడి బాలికల పాఠశాలలో స్టడీ అవర్‌ ను పర్యవేక్షిస్తున్న టీచర్స్‌

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: కోవిడ్‌ మహమ్మారి ప్రభావంతో 2020, 2021లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు లేకుండానే విద్యార్థులు తమ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఏడాది అలా కాకుండా ప్రతి పాఠశాలల్లోనూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టారు. పాఠశాలల్లో విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టేలా రేయి, పగలు కష్టపడి చదువుతున్నారు. ఉపాధ్యాయులు కూడా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతూ టెన్త్‌ పరీక్షల్లో నూరు శాతం సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. టెన్త్‌ పరీక్షలలో యాక్షన్‌ ప్లాన్‌ తో అద్భుత ఫలితాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. పదో తరగతి ఈ ఏడాది నుంచి 6 పేపర్లకు కుదించారు. గతంలో ఏడు పేపర్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి ఫిజికల్‌ సైన్స్‌, బయాలజికల్‌ సైన్స్‌ రెండూ కలిపి ఒకే పేపర్‌ చేయడంతో ఏప్రిల్‌ మూడవ తేదీ నుంచి జరిగే పరీక్షలు 6 పేపర్లు మాత్రమే విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌ కు 100 మార్కులు చొప్పున ఆరు పేపర్లకు 600 మార్కులు ఉంటాయి. అధికారులు విడుదల చేసిన యాక్షన్‌ ప్లాన్‌ జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని దీంతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఏజెన్సీ 11 మండలాల్లో జిటిడబ్ల్యూఎహెచ్‌ఎస్‌, ఎపిటిడబ్ల్యూఆర్‌ ఎస్‌, జిహెచ్‌ఎస్‌, కెజిబివిలతో పాటు ఆయా ప్రైవేట్‌ పాఠశాలల్లోని 7,216 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనున్నారు.
పాడేరులో 4 పరీక్షా కేంద్రాల్లో 844 మంది, జి మాడుగులలోని 4 పరీక్ష కేంద్రాల్లో 591 మంది, డుంబ్రిగూడలో 3 పరీక్ష కేంద్రాల్లో 568 మంది, ముంచంగిపుట్టులో 2 పరీక్ష కేంద్రాల్లో 317, పెదబయలులో 3 పరీక్షా కేంద్రాల్లో 553 మంది, అనంతగిరిలో 3 పరీక్షా కేంద్రాల్లో 364 మంది, అరకు వ్యాలీలో 3 పరీక్ష కేంద్రాల్లో 595 మంది, కొత్త బళ్ళుగూడ పరీక్ష కేంద్రంలో 302 మంది, చింతపల్లిలో 3 పరీక్ష కేంద్రాల్లో 610 మంది, జికె వీధిలోని 3 పరీక్ష కేంద్రాల్లో 534 మంది, సీలేరులోని పరీక్ష కేంద్రంలో 116 మంది, కొయ్యూరులో 3 పరీక్ష కేంద్రాల్లో 645 మంది, హుకుంపేటలో 4 పరీక్ష కేంద్రాల్లో 559 మంది, అనంతగిరి మండలం శివలింగపురంలోని 2 పరీక్షా కేంద్రాల్లో 332 మంది, హుకుంపేట మండలం బాకూరు పరీక్ష కేంద్రంలో 145 మంది, ముంచంగిపుట్టు మండలం జోలపుట్టులోని పరీక్ష కేంద్రంలో 141 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. పరీక్షలు దగ్గర పడే కొద్దీ విద్యార్థుల్లో టెన్షన్‌ పెరుగకుండా విద్యార్థులకు దిశనిర్దేశం చేస్తూ వారిలో టెన్షన్‌ ను పోగొట్టి ధైర్యం నింపుతున్నారు.
స్టడీ అవర్స్‌ ముఖ్య పాత్ర
పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులతో పాటు, స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పరీక్షలను కూడా నిర్వహిస్తూ రోజుకు వారిలోని ప్రతిభ మెరుగు పరుస్తున్నారు. టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్‌ మంచి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని సబ్జెక్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఐటిడిఎ అధికారుల ఆదేశాలతో యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.