May 06,2023 21:45

విద్యార్థిని వేల్పుల కామేశ్వరి (ఫైల్‌)

'పది'లో జిల్లా చివరి స్థానం
- మొత్తం 60.39 శాతం ఉత్తీర్ణత
- రెండు పాఠశాలల్లో ఒక్కరూ పాస్‌ కాని వైనం
- ఫెయిల్‌ అయ్యానని ప్యాపిలి మండలంలో విద్యార్థిని ఆత్మహత్య
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలయిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా మొత్తం 60.39 శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లావ్యాప్తంగా 22,456 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 13,562 మంది పాసయ్యారు. అందులో బాలురు 6,669 మంది, బాలికలు 6,893 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. 100 శాతం 14 స్కూల్స్‌, , 60 శాతం మూడు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించాయి. సున్నా ఉత్తీర్ణత సాధించిన పాఠశాలు రెండు ఉన్నాయి. అందులో డోన్‌లోని వాసవి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, పాణ్యం మండలం తమ్మరాజు పల్లె జడ్పీ హైస్కూల్‌ ఉన్నాయి. జిల్లాలో 60.39 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పదిలో ఫెయిలయ్యాయని.. ప్రాణం తీసుకుంది..
ప్యాపిలి : ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామానికి చెందిన వేల్పుల కామేశ్వరి శనివారం వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కామేశ్వరి ప్యాపిలి కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుతూ ఎస్‌ఎస్‌సి పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.