May 06,2023 22:44

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
            పది పరీక్షా ఫలితాల్లో ఏలూరు జిల్లా 64.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 22వ స్థానం సాధించింది. ఏలూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు 597, 596 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. గతంలో పదో తరగతి ఫలితాల్లో రెండోస్థానం సాధించిన జిల్లా ఇప్పుడు 22వ స్థానానికి దిగజారడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లాలో 22,259 మంది పది పరీక్షలకు హాజరవ్వగా 14,323 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రథమ శ్రేణిలో 10576 మంది, ద్వితీయ శ్రేణిలో 2585 మంది, తృతీయ శ్రేణిలో 1162 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా జెడ్‌పి హైస్కూళ్ల నుంచి 11046 మంది హాజరవ్వగా 5431 మంది ఉత్తీర్ణులయ్యారు. 49.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రయివేటు పాఠశాలల నుంచి 7382 మంది హాజరవ్వగా 6698 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరి ఉత్తీర్ణతా శాతం 90.73గా నమోదైంది. రెసిడెన్షియల్‌ పాఠశాలల నుండి 273 మంది, ఎఐడిఇపి నుండి 298 మంది, సోషల్‌ వెల్ఫేర్‌ నుండి 488 మంది, బిసి వెల్ఫేర్‌ నుండి 16 మంది, ప్రభుత్వ యాజమాన్యం నుంచి 182 మంది, కెజిబివి నుంచి 33 మంది, మున్సిపల్‌ పాఠశాలల నుండి 411 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ నుండి 139 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏలూరు నగరంలోని చైతన్య విద్యాసంస్థకు చెందిన విదార్థులు 596కుపైగా మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఇక ఫెయిలైన విద్యార్థుల్లో ఎక్కువ మంది గణితంలో తప్పినట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా గణితంలో 6773 మంది, సైన్స్‌లో 4658 మంది, సోషల్‌లో 2536 మంది ఫెయిలయ్యారు. ఒక సబ్జెక్టులో ఫెయిలైన వాళ్లు3,366 మంది ఉండగా ఆరు సబ్జెక్టుల్లో ఫెయిలైన వాళ్లు 514 మంది ఉన్నారు.