Apr 07,2023 00:54
పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న వడ్డవల్లి వీరనారాయణ

ప్రజాశక్తి-పంగులూరు: విద్యాదాత, అజిత్‌ కుమార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వడ్డవల్లి వీరనారాయణ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్ష రాసి, బయటకు వచ్చిన విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. పంగులూరు లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, ఈ సంవత్సరం పంగులూరు, చందలూరు, అలవలపాడు హైస్కూళ్లకు చెందిన 214 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులందరికీ అజిత్‌ కుమార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్టు వీరనారాయణ తెలిపారు. అసలే వేసవి కాలం, అందులోనూ మూడు గంటల పాటు కూర్చొని పరీక్షలు రాసిన విద్యార్థులకు, కొంత ఉపశమనం కలిగేందుకు ఈ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ట్రస్ట్‌ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అజిత్‌ కుమార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున వీరనారాయణ, విద్యార్థులకు అవసరమయ్యే అనేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్య్ర దినోత్సవం అయిన ఆగస్టు 15 తేదీన, గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26వ తేదీన మండలంలోని 46 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులందరికీ, ట్రస్ట్‌ తరఫున బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కొన్ని పాఠశాలలకు నోట్‌ పుస్తకాలు, ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్‌లు, ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు. చందలూరు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, రూ.20 లక్షల సొంత నిధులతో, రెండు అదనపు గదులు నిర్మించి ఇచ్చారు. ఇంకా విద్యార్థులకు అనేక అవసరాలు తీరుస్తూ విద్యాదాతగా పేరుపొందారు. విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంచడం పట్ల వీరనారాయణను పలువురు అభినందిస్తున్నారు.