Jul 05,2023 21:56

ఫొటో : మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని పరిచయం చేస్తున్న మంత్రి కాకాణి

పది స్థానాల్లో వైసిపి గెలుపు ఖాయం
- పరిచయ కార్యక్రమ సభలో మంత్రి కాకాణి గోవర్థణ్‌రెడ్డి
ప్రజాశక్తి-ఉదయగిరి : జిల్లాలో 10 నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థుల గెలుపు ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌ గ్రౌండ్‌లో సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎవరైతే ఈ ప్రాంతానికి సమర్థవంతంగా సేవలందించే విధంగా అందరి ఆలోచనలు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కసరత్తు చేసి సమన్వయకర్తగా రాజగోపాల్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర నలుమూలలోనైనా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు తలమానికగా మిగిలాయన్నారు.
రూ.2750 పెన్షన్‌ తీసుకున్న రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రమే అని తెలియజేశారు. అంతేకాకుండా అన్ని కులాలకు సమయుక్తంగా ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు. వృద్ధులకు వలంటీర్‌ ఒకటో తేదీ తెల్లవారక ముందే నగదు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు. గతంలో పెన్షన్‌ ప్రభుత్వ పథకాలు మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీ సిఫార్సులు తప్పనిసరి అని, ప్రస్తుత జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉంటే ప్రతి ప్రభుత్వ పథకాలు నేరుగా ఖాతాలోకి జమవుతాయన్నారు. 2024లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. టిడిపి భూస్థాపితం చేసేందుకు దుష్టచతుష్టయం పూనుకున్నాయని, అందులోని నాయకులే టిడిపిని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయం గురించి పవన్‌, లోకేష్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, పది పంటలలో ఐదు పంటలు పేర్లు చెప్పలేని వీళ్లు వ్యవసాయ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పాదయాత్ర అంటే సమస్యలు పరిష్కరించేందుకు తానున్నానని ధైర్యం చెప్పడమనీ, లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేలా లోకేష్‌ పాదయాత్ర చేయడం హాస్యాస పదమన్నారు. అనంతరం మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పరిస్థితిలో వీడనాడి ప్రస్తుతం మేకపాటి రాజగోపాల్‌ రెడ్డికి అందరూ సహకరించాలని కోరారు. గందరగోళ పరిస్థితులు పునరావృతం కాకుండా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో తాగు, సాగునీరు, విద్య అందించడమే తమ లక్ష్యంగా పనిచేస్తామని ఆయన మాటిచ్చారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి మేరుగా మురళీధరన్‌, ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుద్దీన్‌, యువ నాయకులు షర్ఫుద్దీన్‌, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.