Feb 20,2022 12:46

అతను టీనేజంతా జులాయిగానే తిరిగాడు. ఇంజనీరింగ్‌ మధ్యలోనే ఆపేసి, రెస్టారెంట్‌ పెట్టి, నష్టాలను చవిచూశాడు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఇండోర్‌ వెళ్లాడు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నేడు కొన్ని వందలమంది పేదలకు కేవలం రూ.10కే ఆహారాన్ని అందిస్తున్నాడు. అంతేనా డబ్బు ఇవ్వలేని వారికి ఉచితంగా తిండి పెడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే ఇండోర్‌లోని 'హంగర్‌ లంగర్‌' ఫుడ్‌స్టాల్‌ యజమాని 24 ఏళ్ల శివమ్‌ సోనీ. అతని గురించే..

శివమ్‌ సోనీ మధ్యప్రదేశ్‌లోని సికంద్‌కు చెందిన వ్యక్తి. అతని టీనేజంతా బాధ్యత లేకుండా గడిపాడు. 'నా తల్లిదండ్రులు నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. అందుకోసం ఎంతగానో కష్టపడేవారు. కానీ నాకేమో చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎట్టకేలకు 2016లో అతికష్టం మీద చదువుకు స్వస్తి చెప్పా. స్నేహితుల వద్ద రూ.20 వేల రూపాయలు అప్పుచేసి మరీ రెస్టారెంట్‌ ప్రారంభించా. మొదట్లో అది బాగా జరిగేది. మంచి లాభాలు చవిచూసేవాడిని. నా జీవితం సంతోషంగా గడిచిపోతుంది అనుకుంటున్న సమయంలో అంటే 2018లో సోరియాసిస్‌ వ్యాధి బారినపడ్డా. మోకాళ్లు, మోచేతులు, తలమీద చర్మం పొలుసులుగా ఊడిపోతుండేది. నా ఆరోగ్యం, భద్రతా కారణాల దృష్ట్యా ఆహార పదార్థాల వద్దకు వెళ్లేవాడిని కాదు. రెస్టారెంట్‌లో పనికోసం ఇతరులపై ఆధారపడటం వల్ల ఖర్చు ఎక్కువయ్యేది. 2019లో చికిత్స తీసుకోవడం ప్రారంభించా. దాంతో చాలా అప్పులయ్యాయి. వ్యాపారంలో రూ.18 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. చివరకు 2020లో రెస్టారెంట్‌ను మూసెయ్యాలని నిర్ణయించుకున్నా. అప్పులు తీర్చడానికి నా తల్లిదండ్రులు, తమ్ముళ్లు మా ఇంటిని అమ్మేయడం నన్నెంతగానో బాధించింది. బాగా డిప్రెషన్‌లోకి వెళ్లా. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. ఆ సంవత్సరం మార్చిలో కోవిడ్‌ నిబంధనల కారణంగా రవాణా సౌకర్యం అరకొరగా ఉంది. నాకోసం వెతకవద్దని ఒక సూసైడ్‌ లెటర్‌ రాసి, బస్టాండ్‌కు వెళ్లా. అక్కడ మా ఊరికి 400 కి.మీ దూరంలోనున్న ఇండోర్‌ బస్సు మాత్రమే ఉంది. దానిలో ఎక్కాను. కానీ అక్కడికి వెళ్లి ఏమి చేయాలి? అనేది తెలీదు' అంటున్నాడు శివమ్‌ సోనీ.
 

                                                   ప్రతిక్షణం నరకం చూశా

'ఇంటి నుంచి కేవలం రూ.500లతో, కట్టుబట్టలతో బయలుదేరా. అప్పుడు దేశమంతా లాక్‌డౌన్‌ కావడం వల్ల ఎక్కడా దుకాణాలు, రెస్టారెంట్లు లేవు. తినడానికి తిండి దొరికేది కాదు. బిస్కెట్లు తిని బతికాను. ఆహారం లేకుండా గడిపిన రోజులున్నాయి. ఒక్కోపూట భోజనం కోసం ఎంతో కష్టపడేవాడిని. దాతలు ఇచ్చే ఆహార ప్యాకెట్లు తిని ప్రభుత్వాసుపత్రి, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లలో పడుకునేవాడిని. అప్పుడే జీవితం విలువ తెలిసింది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని మార్చుకున్నా. నాలా మరెవరూ కష్టపడకూడదు అనుకున్నా. లక్షలాది మంది ఈ దేశంలో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. నా వంతుగా అలాంటివారికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఎలాగైనా ఏదో ఒక ఉద్యోగం సాధించాలని ఎంతగానో ప్రయత్నించా. నెలరోజుల తర్వాత ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం వచ్చింది. రూ.6 వేల జీతంతో పాటు క్యాంటీన్‌లో ఆహారం పెట్టేవారు. కొద్ది నెలల్లోనే రూ.8 వేల జీతం వస్తుందని రెసిడెన్షియల్‌ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా చేరా. వాళ్లు పుడ్‌తోపాటు వసతి కల్పించారు. అప్పుడు మా అన్నదమ్ములు నిఖిల్‌, వివేక్‌కు ఫోన్‌ ద్వారా నేనెక్కడ ఉంది సమాచారమిచ్చా. వాళ్లు అప్పటికే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారట' అంటున్నాడు శివమ్‌.
 

                                              'హంగర్‌ లంగర్‌' పుడ్‌స్టాల్‌

ఇండోర్‌లోని మీరా గార్డెన్‌ దగ్గర మతగుజ్రి కళాశాల సమీపంలో 'హంగర్‌ లంగర్‌' అనే ఫుడ్‌స్టాల్‌ను ప్రారంభించాడు శివమ్‌. అతను ఉద్యోగం చేసి దాచిన డబ్బుతోనే దానిని ఏర్పాటుచేశాడు. కేవలం రూ.10కి నాణ్యమైన ఆహారాన్ని అందించడం మొదలెట్టాడు. 'నిజానికి నా రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అలాచేస్తే నా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భయపడ్డా. నా రెస్టారెంట్‌ ఏర్పాటులోనూ నా కుటుంబం అండగా నిలిచింది. నన్ను ఎంతగా వారు ప్రేమిస్తున్నారో మరోసారి నిరూపించారు. మా దగ్గర మసాలా దోశ, ఉప్మా, ఇడ్లీ- సాంబార్‌ రూ.10 కే లభిస్తాయి. అన్నం, పప్పు, రెండు కూరలు, పూరీల ప్యాకెట్‌ను కేవలం రూ.30కే ఇస్తున్నాం. ఇది కూడా ఇవ్వలేని వారు ఎవరైనా ఉంటే వారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తాము' అంటున్నాడు శివమ్‌.
తనకున్న సమస్యలను మనోధైర్యంతో ఎదుర్కొని, ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయి నుంచి పదిమంది కడుపునింపే స్థాయికి ఎదిగిన శివమ్‌ నేటి యువతకు స్ఫూర్తివంతం.