Apr 06,2023 23:49

పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తున్న ఎస్‌పి ఆరిఫ్‌ హఫీజ్‌

ప్రజాశక్తి-గుంటూరు : నగరంలోని పాత గుంటూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో పదో తరగతి పరీక్ష రాసే యాదవ హైస్కూల్‌లో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్‌పి ఆరిఫ్‌ హఫీజ్‌ ఐపిఎస్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పరీక్ష జరిగే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, స్మార్ట్‌ వాచ్‌, మొబైల్‌ ఫోన్స్‌, ఐపాడ్‌ , ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరాదని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది, వ్యక్తులు గానీ ఉండకుండా చూడాలని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల, సిబ్బందిని ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ తో మాట్లాడి పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటామని, విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌కు విద్యార్థులు పాల్పడిన, అలాంటి వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారుజిల్లా వ్యాప్తంగా ఎదైనా పరీక్షా కేంద్రం వద్దనైనా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే 100కు లేదా జిల్లా పోలీస్‌ వాట్సాప్‌ 8688831568కు సమాచారం అందించాలని ఎస్‌పి కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సిఐ సుబ్బారావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ శ్రీనివాసరావు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.