నేటి నుంచి పరీక్షలు ప్రారంభం
అరగంట ముందుగానే పరీక్ష హాలులోకి చేరుకోవాలి
హాల్ టిక్కెట్ చూపితే ఆర్‌టిసిలో ప్రయాణం ఉచితం
ఆరు సున్నిత కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వి.రవిసాగర్
ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్
ఈనెల మూడో తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, అలాగే సంచలన ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వి.రవిసాగర్ తెలిపారు. ఇందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేశామని చెప్పారు. నో ఫోన్ జోన్‌గా పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రజాశక్తి నిర్వహించిన ముఖాముఖిలో పలు ప్రశ్నలకు డిఇఒ సమాధానం చెప్పారు.
ప్రశ్న : ఎన్ని కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు?
పదో తరగతి పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా ఎ, బి, సి కేటగిరిలో కేంద్రాలను ఏర్పాటు చేశాం 'ఎ' కేటగిరిలో 29 కేంద్రాలు, 'బి' కేటగిరిలో 54, 'సి' కేటగిరిలో 37 కేంద్రాలు మొత్తంగా 120 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం
ప్రశ్న : ఈ ఏడాది ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు?
రెగ్యులర్ విద్యార్థులు 22,809 రాస్తున్నారు. వీరిలో బాలురు 11,356మంది, బాలికలు 11,453 మంది ఉన్నారు. పదో తరగతి సప్లిమెంటరీ రాసే బాలురు 2162 మంది, బాలికలు 1246 మంది మొత్తంగా 3408 మందిగా నమోదయ్యారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులు కలిపి 26,217 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 13,518, బాలికలు 12,699 మంది ఉన్నారు.
ప్రశ్న : పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు ఏమి తీసుకున్నారు?
పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్‌ఫోన్ జోన్‌గా ప్రకటించాము. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఇన్విజిలేటర్లు గానీ, డిఒలుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరీఓఆ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా ఉత్తర్వులు జారీచేశాం. వారివారి సెల్‌ఫోన్లు పరీక్షా కేంద్రాల గేట్ బయట మాత్రమే వదిలి లోపలికి వెళ్లే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. 120 పరీక్షా కేంద్రాల వద్ద ఒక్కొక్క కేంద్రంలో ఒక ఎఎన్‌ఎం, ఒక ఆశా వర్కర్ అత్యవసర పరిస్థితుల కోసం వినియోగిస్తున్నాము ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా స్థానికంగా ఉండే తహశీల్దార్లు, ఎంపిడిఒలు అకస్మాత్తుగా పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేయాలని సూచనలు చేశాం.
ప్రశ్న : సున్నితమైన సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా?
గత ఏడాది జిల్లావ్యాప్తంగా నాలుగు సున్నిత ప్రాంతాలను గుర్తించి వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈసారి ముందస్తుగానే ఆరు సెంటర్లను గుర్తించి కెమెరాలు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఈ సెంటర్ల వద్ద బందోబస్తు కూడా పెంచాము. కైకరం, రంగాపురం, లింగపాలెం, పిప్పర, లక్కవరం, చింతలపూడి, కోరుకొల్లు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాము.
ప్రశ్న : పరీక్ష సమయం చెబుతారా?
ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకూ పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంది. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తాము.
ప్రశ్న : ఉచిత బస్సు పాస్ పరిస్థితి ఏమిటి?
ఇప్పటికే ఆర్‌టిసి అధికారులతో మాట్లాడి పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాము. కండక్టర్‌కు హాల్‌టిక్కెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చు.
ప్రశ్న : ఉత్తమ ఫలితాల సాధనకు చేపట్టిన ప్రయోగాత్మక చర్యలేమైనా ఉన్నాయా?
ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాము. ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు కలెక్టర్ ద్వారా విజయభేరి కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీంతోపాటు విజయకేతనం కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రతిభ పెంచేందుకు చర్యలు తీసుకున్నాము. వారిలో మానసిక వికాసం కోసం డాక్టర్ మానస ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్‌లు కూడా పలుచోట్ల ఏర్పాటు చేశాము.
ప్రశ్న : విద్యార్థులకు మీరిచ్చే సూచనలు, సలహాలు?
విద్యార్థులు మానసిక ధైర్యంతో పరీక్షలు రాయాలి. ఒత్తిడికి గురికావొద్దు. ఆందోళన, కంగారు పడొద్దు. తగినంత విశ్రాంతి తీసుకుని పరీక్షలకు హాజరుకావాలి. తల్లిదండ్రులు సైతం ఇళ్లల్లో వారు చదువుకోవడానికి కావాల్సిన వసతులు కల్పించాలి. చదువు గురించి పిల్లలపై ఒత్తిడి చేయొద్దు. చదువుకోమని చెబితే సరిపోతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.










