Oct 08,2023 00:08

మార్కుల జాబితా పేరుతో ప్రైవేటు పాటశాలల దోపిడీ
- అవకాశం వచ్చినప్పుడల్లా వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు
- వసూలు చేసిన డబ్బు తిరిగి ఇప్పించాలి
ప్రజాశక్తి - బాపట్ల రూరల్
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మార్కు లిస్టులు ఇవ్వాలంటే రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూళ్లు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య అన్నారు. డబ్బు వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిఇఒ రామారావుకు వినతి పత్రం శనివారం అందచేశారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు ఒరిజినల్ మార్క్ లిస్టులను అన్ని పాఠశాలలకు విద్యాశాఖ పంపిణీ చేసిందని తెలిపారు. వాటిని విద్యార్ధులకు ఇచ్చేందుకు అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు విద్యార్థులు ఎస్ఎఫ్ఐ దృష్టికి తీసుకు వచ్చారని డిఇఒకు వివరించారు. విద్యార్థులు 10సంవత్సరాల పాటు కష్టపడి చదువుకుని సంపాదించుకున్న మార్కుల జాబితా కోసం లంచం అడగడం అంటే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు ఏమి నేర్పిస్తున్నాయని ప్రశ్నించారు. పాఠశాలల్లో చేరినప్పటి నుండి పుస్తకాలకు, యూనిఫాం, పరీక్షల ఫీజుల పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇవి సరిపోవు అన్నట్టు దొరికిందే సందుగా మార్క్ లిస్ట్ కోసం డబ్బులు వసూలు చేయడం సరైనది కాదని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఈ పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు. వెంటనే ఈ ఘటనపై విద్యా శాఖ అధికారులు స్పందించాలని, ఎక్కడైతే సర్టిఫికెట్ కోసం డబ్బులు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వద్ద తీసుకున్న సొమ్ము తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సర్టిఫికెట్ కోసం ఎవ్వరికీ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.