Nov 09,2023 22:57

పడి లేచిన కెరటమే ఆదర్శం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
విద్యార్థి జీవితంలో గెలుపు ఓటమి సహజమని, ఓడినవారు పడి లేచే కెరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని డిఇఒ ఎస్‌.అబ్రహం అన్నారు. సిబిఎస్‌ఇ ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడా పోటీల ఎంపికలో విజేతలుగా నిలచిన రాజమహేంద్రవరం శ్రీ సత్య సాయి గురుకులం విద్యార్థినీ, విద్యార్థులకు గురువారం శ్రీ సత్య సాయి గురుకులంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని అంశాల్లోనూ ఉన్నతంగా ఎదగాలని అన్నారు. విద్యార్థి దశ వ్యక్తి జీవితంలో సర్వోన్నతమైనదని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురుకులం కరస్పాండెంట్‌ ఏ.శ్యాంసుందర్‌ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల ఉన్నతకి ఉచిత విద్యను అందిస్తోందన్నారు. గురుకులం ప్రిన్సిపల్‌ కె.గుర్రయ్య మాట్లాడుతూ సిబిఎస్‌ఇ నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచి త్వరలో జరిగే సిబిఎస్‌ఇ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడాంశాలలో ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల తూర్పు, అమలాపురం, కాకినాడ జిల్లాల అధ్యక్షులు బులుసు వెంకటేశ్వర్లు, అడబాల వెంకటేశ్వరరావు, గోవిందరాజులు, గురుకుల కమిటీ సభ్యులు సోమ సుందర్‌ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సత్యసాయి సేవా సంస్థల పదాధికారులు పాల్గొన్నారు.