Jun 15,2023 23:59

రెంటపాళ్లలో విద్యార్థులకు ప్రోత్సాహక నగదు, మెడల్స్‌ అందిస్తున్న మంత్రి అంబటి రాంబాబు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్‌ కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించారని, వారిని ప్రోత్సహించేందుకు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మండలంలోని రెంటపాళ్ల జెడ్‌పి పాఠశాలలో గురువారం జరిగిన కార్యక్రమానికి ఎంఇఒ ఎ.శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. మంత్రి మాట్లాడుతూ ఏ విద్యార్థీ పేదరికంతో చదువుకు దూరం కాకుండా ఉండేందుకే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, వనరులు కల్పించి మెరుగులు దిద్దామని, అభివృద్ధి చర్యలతో విద్యార్థుల చేరిక, హాజరు కూడా పెరిగిందని చెప్పారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను, ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ ఏడాదిలో ప్రథమ స్థానంలో నిలిచిన నాలుగు గ్రూపుల్లో నలుగురు విద్యార్థులకు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.రాజనారాయణ, పాకాలపాడు సొసైటీ అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, వైసిపి నాయకులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - వినుకొండ : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంఇఒ జఫ్రుల్లాఖాన్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీరాములు మాట్లాడుతూ నియోజకవర్గంలో 3522 మంది విద్యార్థి పరీక్షలు హాజరు కాగా 2573 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. వినుకొండ మండలంలో 954 మంది విద్యార్థులకు 630 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో 553 మార్కులు పైగా వచ్చినవారు 45 మంది ఉన్నారని తెలిపారు. ఇంటర్‌ ఎంపీసీలో ధనలక్ష్మి, బైపీసీలో కొండ్రు జ్యోతి, సీఈసీలో బీ. చైతన్య, హెచ్‌ఈసిలో పల్లె పవన్‌ ఉత్తమ ప్రతిభ కనపరచగా ఒక్కొక్కరి రూ.15 వేల ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే అందించారు. పదవ తరగతిలో ప్రథమ బహుమతి జి.వెంకటేష్‌కు రూ.15 వేలు, ద్వితీయ బహుమతి రోహిత్‌ కుమార్‌రెడ్డికి రూ.10 వేలు, తృతీయ బహుమతి సుష్మ, ప్రేమ్‌సాగర్‌కు రూ.5 వేలు చొప్పున అందించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించారు.