May 02,2021 14:39

పచ్చదనం కనువిందే కాదు.. మనసుకు హాయిగొల్పేది.. అలాంటిది... ఆ పచ్చదనపు వాతావరణంలో మనం ఉంటే ఇంకెంత బాగుంటుంది.. పచ్చ పచ్చని వాతావరణంలో.. చల్ల చల్లగా.. హాయిగా ప్రకృతి కనువిందు చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే చక్కని ఆహ్లాదకరమైన ప్రకృతి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ప్రకృతి ప్రేమికులకు పచ్చదనమంటే అంత ఇష్టం మరి... అయితే అనేక మంది ప్రకృతి, వృక్ష ప్రేమికులు తమ కలల సౌధాలను నిర్మించుకుంటున్నారు.. అదే కలల సౌధాలపై పచ్చని వనాలను సృష్టిస్తూ.. ప్రకృతి, పర్యావరణ హితులుగా నిలుస్తున్నారు. అయితే మేడపై పెరడు పెంచడం అంత కొత్త.. వింతేమీ కాదు.. అయితే ఇటీవల ఈ తరహా ప్రకృతి ప్రేమకులు ఇటీవల కాలంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కోవలోనే బెంగళూరు వివేకానందనగర్‌కు చెందిన నటరాజ ఏకంగా మేడపై 1700 చెట్లతో అడవినే నిర్మించారు. తద్వారా తన చుట్టు ఉన్న పరిసరాల ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారకుడయ్యాడు. రిచ్చర్డ్‌ టౌన్‌కు చెందిన జిన్నీ శామ్యూల్‌ 300 రకాలతో కూరగాయల సాగును చేపట్టారు.

                                                          టెర్రస్‌పై 1700 చెట్లతో అడవి..

butterfly

 

animal

 

animal

 మొక్కలు పెంపకం, గార్డెనింగ్‌ అంటే ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టం. అందుకే చాలామంది తమ ఇళ్లలో రకరకాల మొక్కలు పెంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరడును పెంచుతారు. అయితే ప్రస్తుతం పట్టణీకరణతో అంతా కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతుంది. అలాంటి ఇరుకు కాంక్రీట్‌ టెర్రస్‌పై 1700 చెట్లతో అడవిని పెంచాడు ఓ ఔత్సాహిక ప్రకృతి ప్రేమికుడు. అతడే బెంగళూరుకు చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ నటరాజ ఉపాధ్యాయ.
   బెంగళూరు వివేకానందనగర్‌లోని బనశంకరి ప్రాంతంలోని తన నివాసంలోని టెర్రస్‌పై నటరాజ 300 రకాల చెట్లను పెంచారు. ఈ పట్టణ అడవిలో సుమారు 50 రకాల సీతాకోకచిలుకలు, డజనకుపైగా రకాల పక్షులు ఆతిథ్యం పొందుతున్నాయి. ఈ అడవి పెంపకం వల్ల వేసవిలో తనకు ఫ్యాన్‌ కూడా వేసుకునే పనిలేదని చెబుతున్నారు నటరాజ. అయితే ఇదెలా సాధ్యమయ్యిందో.. అడవిని పెంచడంలో నటరాజ ఎదుర్కొన్న సమస్యలేంటో.. ఓ సారి చూద్దాం. ఒత్తిడితో కూడిన జీవనశైలికి అలవాటుపడిన 58 ఏళ్ల ఐటి ప్రొఫెషనల్‌ 2008లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం నటరాజ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రోజూ 18 గంటలు పనిచేస్తారు. రోజుకు ఐదు గంటలు డ్రైవింగ్‌ చేస్తారు. పైగా ప్రత్యేక అవసరాలు గల అతని భార్య, ఇద్దరు కుమార్తెలకు తన అవసరం ఎంతో ఉందని. అందుకే ఆరోగ్యం, కుటుంబంపై దృష్టి సారించాలనుకున్నానని అంటారు.
   వేసవి ప్రారంభంలో తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోయాడు. దీంతో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు 2010లో కూలర్ల ఉపయోగించడం కన్నా మొక్కల పెంపకమే సరైన మార్గంగా భావించాడు. అప్పటికే తన ఇంటి చుట్టూ మొక్కలతో గార్డెన్‌ పెంచిన నటరాజ టెర్రస్‌పై తోటపని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా ప్రకృతికి ఉపయోగంగా ఉంటూ తన నివాసానికి ఉష్ణోగ్రతల నుంచి రక్షించాలనుకున్నారు.
   ఉడిపిలోని పరంపల్లి వ్యవసాయ కుటుంబానికి చెందిన నటరాజ తన మూలాలకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తోటపని, ప్రకతి పట్ల తన అభిరుచిని కొనసాగించాడు. తనకు చిన్నతనం నుంచే బాల్కనీలో మొక్కలు పెంచడం అంటే ఇష్టమని చెప్తారు. ఆ అనుభవాన్ని ఉపయోగించి బియ్యం సంచుల్లో, వేస్ట్‌ కంటెయినర్లలో మొక్కలను పెంచడం ప్రారంభించాడు. మొదట కూరగాయలు, ఔషధ మొక్కలు పెంచడం ప్రారంభించారు. 'ఇంటిపై సుమారు 1,500 చదరపు అడుగుల టెర్రస్‌ ఉంది. దీంతో పెద్ద మొక్కలు, చెట్లను పెంచే అవకాశం కలిగింది. 2012 నాటికి రీసైకిల్‌ చేసిన 55 లీటర్ల డబ్బాల్లో చెట్లను ప్రారంభించడం మొదలుపెట్టాను' అని నటరాజ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రయత్నాలు ఫలించి 300 రకాల మొక్కల పెంపకంతో లక్ష్యాన్ని చేరుకున్నాడు నటరాజ. వీటిలో 72 జాతులకు చెందిన 100 చెట్లు, లతలు, పండ్ల చెట్లు, కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఈ దట్టమైన అడవిలో మోరింగా, వెదురు, డ్రమ్‌ స్టిక్‌, చింతచెట్లు, వైల్డ్‌ఫిగ్‌ చెట్లతో టెర్రస్‌ ఆకుపచ్చని పరదా కప్పుకుంది. ఈ అడవిలో 50 రకాల సీతాకోకచిలుకలు, డజను జాతుల పక్షులు, వందలాది కీటకాలు, ఉడుతలు, గబ్బిలాలు ఆవాసం పొందుతున్నాయి. అయితే 'ఈ అడవి వల్ల తనకు వేసవిలో కూలర్లు, ఫ్యాన్ల అవసరం లేదని, శీతాకాలంలో మాత్రం చలిని తట్టుకునేందుకు మందపాటి దుప్పట్లు అవసరం ఉంది. దీనివల్ల నా నివాసంలో ఉష్ణగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉండేందుకు సహాయపడుతుంది' అని నటరాజ చెబుతున్నారు.
 

                                                         ఆటంకాలను ఎదుర్కొని...

   ఈ గ్రీన్‌జోన్‌ని పెంచడానికి నటరాజ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాడు. '1987లో నిర్మించిన ఇల్లు చాలా పాతది. దీనివల్ల పైకప్పుపై ఒత్తిడిని తగ్గించడానికి, స్తంభాల అంచున డ్రమ్స్‌ ఉంచాను. దీనివల్ల స్లాబ్‌ సురక్షితంగా ఉంటుంది. భారం మొత్తం స్తంభాలపై పడుతుంది. లీకేజీలు, ఇతర వాటర్‌ రూఫింగ్‌ గురించి కూడా జాగ్రత్త తీసుకున్నాను' అని నటరాజ చెబుతున్నారు.

                                                   కంపోస్ట్‌, సేంద్రీయ పద్ధతిలో...

   'తన ఇంటిలోని మొక్కలకు కంపోస్ట్‌, సేంద్రీయ పద్ధతులను ఉపయోగిస్తానని, దీనివల్ల డ్రమ్స్‌ బరువు తగ్గుతుందని, అడవి నుండి కూరగాయలను కోసే విషయంలో ఉత్పాదకతకు డిమాండ్‌ లేనందున, నేల నాణ్యతను మెరుగుపరచడంపై దష్టి పెట్టలేదు. దీనివల్ల ఫలితంపై ఎటువంటి ఒత్తిడీ లేదు, అందుకు కంపోస్ట్‌ మాత్రమే సరిపోతుంది. మొక్కల రక్షణకు ఎప్పుడూ పురుగుమందుల అవసరం రాలేదు. వర్షపునీరు సహజంగా భూమిలో ఇంకిపోతుంది. ఫలితంగా భూగర్భజలాలు పెరుగుతాయి' అని వివరించారు.
 

                                                    వంటగది వ్యర్థాలే ఎరువులు..

   'వంటగది వ్యర్థాలను పారేయకుండా 2010 నుండి కంపోస్ట్‌గా మారుస్తున్నాం. ఇటువంటి చర్యల వల్ల పర్యావరణంలో ఆక్సిజన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పైగా చుట్టుపక్కల ప్రజలు స్వచ్ఛమైన గాలిని పొందుతారు. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పులను, ముప్పును తగ్గించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి' అని చెబుతున్నారు. దీనికి సంబంధించి 450కి పైగా వీడియోలను యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ అందుబాటులో ఉంచారు. తద్వారా జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ఎందరో ప్రకృతి ప్రేమికులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

                                                                    మేడమీద నీలి విప్లవం..

 మేడమీద నీలి విప్లవం..

 

plants

 

 లాక్డౌన్‌ సమయంలో కిరాణా దుకాణాల వద్ద సుదీర్ఘ క్యూలో వేచి ఉన్న జిన్సీ శామ్యూల్‌ హైడ్రోపోనిక్‌, ఆక్వాపోనిక్‌ వ్యవసాయ పద్దతిని ఉపయోగించి తన ఇంటి మేడమీద సొంతంగా ఆహార ఉత్పత్తిని ప్రారంభించారు. బెంగళూరులో ట్రాఫిక్‌ గందరగోళం మధ్య, రిచర్డ్స్‌ టౌన్‌లో ఇంద్రధనస్సు రంగులతో నిండిన జిన్సీ శామ్యూల్‌ మేడ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఒక్క పూలమొక్కలు మాత్రమే కాదు.. సాధారణ కూరగాయలు, రొయ్యలు, టిలాపియా చేపలు వంటివాటితో హెర్బ్‌ మొక్కలనూ పెంచుతున్నారు. జిన్సీ తన మొక్కలను హైడ్రోపోనిక్స్‌, వంటి పద్ధతులను ఉపయోగించి పెంచుతున్నారు. ఇవి సాధారణ నేల-ఆధారిత పద్ధతులకు భిన్నం.

   గతేడాది మార్చిలో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లినప్పుడు సూపర్‌ మార్కెట్ల బయట పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడేవారు. ఈ సమయంలోనే జిన్సీ, భర్త బెన్సన్‌ శామ్యూల్‌ ఇద్దరూ తమ ఆహారాన్ని సొంతంగా తామే పండించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఎక్కువ సమయం షాపుల ముందు క్యూలో నిలబడాల్సిన పని నుంచి, అలసట నుంచి ఉపశమనం పొందారు. జిన్సీ, ఆమె అత్తగారు ఇద్దరూ కలిసి తోట పనిని ఎంతో ఉత్సాహంగా నిర్వహించేవారమని తెలిపారు.
   జిన్సీ, ఆమె భర్త ఇద్దరూ ఉద్యోగులు అయినందువల్ల, ఆహార ఉత్పత్తిలో శిక్షణ లేనందు వల్ల అధ్యయనానికి కొంత సమయం కేటాయించారు. ఈ క్రమంలో రెండు కారణాల వల్ల హైడ్రోపోనిక్స్‌, ఆక్వాపోనిక్స్‌ పద్ధతులకు ఆకర్షితులయ్యారు. ఎంబీఏ చేసిన జిన్సీ బిపిఓలో పనిచేస్తూ, క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్‌ నడుపుతున్నారు. భర్త టెక్నాలజీ రంగంలో నిష్ణాతులు.
 

                                                      హైడ్రోఫోనిక్స్‌తో ప్రయోజనాలు...

   అయితే వీరు మొదట తమకు అందుబాటులో ఉన్న పరిమిత స్థలం, సాంప్రదాయ నేల ఆధారిత తోటపనితో పోలిస్తే హైడ్రోఫోనిక్‌ వ్యవస్థ పట్టణ గృహంలో సులభంగా ఏర్పాటు చేయవచ్చని భావించారు. దీంతో మట్టి, హైడ్రోఫోనిక్స్‌ పద్ధతులను ఉపయోగించి, వాటిలోని వ్యత్యాసాలను పరిశీలించారు. పాలిహౌస్‌ కలిగి ఉన్నందున మొక్కలపై తెగుళ్లు దాడి చేయలేవు. అదే సమయంలో మొక్కకు ఏ పోషకాలు లభిస్తాయో మనమే నియంత్రించవచ్చు. ఇది నేల ఆధారిత సాగు కంటే మంచి ఫలితాలను ఇస్తుందని జిన్సీ చెబుతున్నారు. హైడ్రోపోనిక్‌ వ్యవస్థలో పొటాషియం, నత్రజని వంటి ప్రాథమిక పోషక లవణాలతో పాటు మొక్కలకు అవసరమైన వాటికి ఎంత నీరు వాడతారు అనేదానికి అనుగుణంగా నీటిని కలిపే జలాశయం ఉండాలని, ఫలితంగా హైడ్రోపోనిక్స్‌ జల ద్రావణం మూలాల ద్వారా చక్కటి పెరుగుదలను అందిస్తుందని జిన్సీ వివరిస్తున్నారు.
 

                                                    మూడు వ్యవస్థల కలయిక...

   ఆక్వాపోనిక్స్‌, మరోవైపు ఆక్వాకల్చర్‌, హైడ్రోపోనిక్‌ వ్యవస్థల కలయిక ఒక సహజ పర్యావరణ వ్యవస్థను అనుకరించే పద్ధతి. దీని మూలకం వ్యర్థాలను ఒకదానికి మరొకటి ప్రయోజనం చేకూరుస్తాయి. అసలు ఆక్వాపోనిక్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో జిన్సీ వివరించారు. 'ఈ పద్ధతిలో తినదగిన చేపలను పెంచుతారు. కాబట్టి దీనివల్ల మాంసాహారాన్ని పొందవచ్చు. దీనిని పండించాలనుకునేవారు ఖనిజీకరణ ట్యాంక్‌ ద్వారా నీరు వెళ్లే పద్ధతిని అవలంభించాలి. ఈ శుద్ధి చేసిన నీటిని కూరగాయలను పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది పునర్వినియోగ వ్యవస్థ. హైడ్రోపోనిక్స్‌, ఆక్వాపోనిక్స్‌ మట్టిని నీటితో భర్తీ చేస్తాయి. తద్వారా తెగుళ్లు, కీటకాలు మొక్కలపై దాడి చేయకుండా నిరోధించడానికి పాలీహౌస్‌ వంటి నియంత్రిత వ్యవస్థ ఏర్పడుతుంది' అని తెలిపారు.

                                                      500 చదరపు అడుగుల మేడపై...

   ప్రస్తుతం జిన్సీ తన 500 చదరపు అడుగుల మేడపై 200 నుండి 230 రకాల మొక్కలను పెంచుతుంది. వంకాయలు, చెర్రీ టమోటాలు, బచ్చలికూర, కాలే, ముల్లంగి, పుదీనా, ఓక్రా, ఎర్ర పాలకూర, మంచుకొండ పాలకూర, బ్రోకలీ వంటి ఎక్సోటిక్స్‌ వంటి మొక్కలు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని రకాల రొయ్యలు, టిలాపియా చేపలు వంటి వాటిని జిన్సీ సాగు చేస్తున్నారు. తమ సాగు ద్వారా వచ్చిన ఉత్పత్తులను పొరుగువారికి, నగరంలోని సేంద్రీయ దుకాణానికి అమ్మడం ప్రారంభించారు. లాక్‌డౌన్‌లో తమ ఆహారం ఉత్పత్తి కోసం ప్రారంభించిన ఈ సాగు ద్వారా జిన్సీ నెలకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకూ సంపాదిస్తున్నారు. తనలాంటి అనేక మంది ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ సొంతంగా హైడ్రోపోనిక్‌, ఆక్వాపోనిక్‌ సాగుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు జిన్సీ.

                                                                  రీసైక్లింగ్‌ ట్రేల్లో 40 రకాల సాగు

 రీసైక్లింగ్‌ ట్రేల్లో 40 రకాల సాగు

   మేడ మీద సేంద్రీయ కూరగాయల సాగు, రీసైకిల్‌ చేసిన ట్రేలలో ఇంటి పంటలను పండించాలనుకునే వారికి ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, అనేక మందికి చక్కని చిట్కాలు చెబుతూ ప్రోత్సహిస్తున్నారు ఢిల్లీకి చెందిన ఐరీన్‌ గుప్తా.

   60 ఏళ్ల ఐరీన్‌ గుప్తా 2014లో తన ఇంటిని అపార్ట్మెంట్‌ కాంప్లెక్స్‌గా మార్చారు. అప్పటి వరకూ ఇంటి చుట్టూ ఉండే స్థలంలో వివిధ రకాల మొక్కలు పెంచిన ఆమె మొక్కల పెంపకంపై ఉన్న మక్కువతో క్లాంప్లెక్స్‌లో కొంత భాగాన్ని మొక్కల పెంపకానికి కేటాయించారు.

                                                                  కాలానుగుణ మొక్కల సాగు....

panasa

   టెర్రకోట కుండల్లో పెటునియాస్‌, డహ్లియాస్‌ వంటి కొన్ని కాలానుగుణ వసంత పువ్వులను నాటడం ద్వారా ఆమె ప్రయాణం మొదలైంది. తర్వాత కొన్ని నెలలకు ఐరీన్‌ తన గార్డెన్‌కి మరింత ఆకర్షితురాలైంది. కొన్ని టెర్రకోట కుండల నుండి ప్లాస్టిక్‌ డబ్బాలు, థర్మోకోల్‌ పెట్టెలు, పెయింట్‌ బకెట్లు, వాటర్‌ ట్యాంక్‌, మరెన్నో కంటైనర్లను ఉపయోగించి దాదాపు 40 రకాల కూరగాయలను, పండ్లను పండిస్తున్నారు. ఐరీన్‌ తన పరిమిత స్థలంలో ఒక అందమైన ఉద్యానవనాన్ని సృష్టించారు.
   మొదట ఐరీన్‌, ఆమె తల్లి కలిసి ఒక సహాయకునితో రెండు వేల చదరపు అడుగుల మేడపై కలబంద, పోనీటైల్‌ పామ్స్‌, మనీ ప్లాంట్స్‌, పెటునియాస్‌, క్రిసాన్తిమమ్స్‌, మరెన్నో కాలానుగుణ వసంత పుష్పాలతో సహా 10 రకాల మొక్కలను నాటారు.
'ఈ మొక్కలను మా పాత ఇంటిలో అమ్మ పెంచేది. మేము వాటిని సేంద్రీయ కుండల మట్టితో టెర్రకోట కుండల్లో నుంచి మేడ మీదకు బదిలీ చేశాము. కొన్ని నెలల్లో పువ్వులు ఉత్పత్తి చేయడం ప్రారంభించాం. ఈ సమయంలో మొక్కల నాణ్యత, ఉత్పత్తి విషయంలో రాజీపడకుండా మొక్కల పెంపకందారుల బరువును తగ్గించే మార్గాలు తెలుసుకోవడానికి ఇది ఒక శిక్షణా తరగతిలా నాకు ఉపయోగపడింది. అంతే కాకుండా అనేక అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయించాను' అని ఐరీన్‌ తెలిపారు.
 

                                                  వివిధ దేశాల బ్లాగుల నుంచి...

   మొదట అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల నుండి అనేక బ్లాగులను చూసి తోటపని చిట్కాలు, వారి వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను తెలుసుకున్నారు. తర్వాత భారతీయ బ్లాగులను సందర్శించి, ఇక్కడ పరిస్థితులకు అక్కడివారు అవలంభించిన పద్ధతులను అన్వయిచుకున్నారు. భాషను అర్థం చేసుకోలేకపోయి నప్పటికీ, ''కిస్సాన్‌ కేరళ'' అనే మలయాళ టెలివిజన్‌లో క్రమం తప్పకుండా చూసేవారు. సాగుకు సంబంధించిన పద్ధతులను అందులో తెలుసుకున్నారు. కోకోపీట్‌, కొబ్బరి కంపోస్టింగ్‌, మరెన్నో పద్ధతుల్లో మొక్కల పెంపకం గురించి తెలుసుకున్నారు. మేడపై భారాన్ని తగ్గించేందుకు చెక్క, ప్లాస్టిక్‌ డబ్బాల్లో సాగు చేయడాన్ని ఆమె పరిశీలించారు.
 

recycleing

                                                                రీసైకిల్‌ కంటైనర్లలో...

   రీసైకిల్‌ కంటైనర్లను సేకరించి, టమోటా, వంకాయ, క్యాబేజీ, పొట్లకాయ, జామ, పైనాపిల్‌, స్ట్రాబెర్రీలతో సహా పలు రకాల కూరగాయలను పండించడం ప్రారంభించారు. సీజన్‌ను బట్టి కూరగాయలను పండించారు. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గిలోరు, తులసి వంటి కొన్ని ఆకుకూరలు ప్లాస్టిక్‌ డబ్బాలు లేదా పెయింట్‌ బకెట్లు వంటి కంటైనర్లలో శాశ్వతంగా పెరుగుతున్నాయి. థర్మోకాల్‌ బాక్సులు, ప్రింటర్‌ ఇంక్‌ డ్రమ్స్‌, పాత గన్నీ సంచులను కూడా రీసైకిల్‌ చేసి మొక్కలను పెంచుతున్నారు.
మొక్కలకు పోషకాహారంగా, కిచెన్‌ వ్యర్థాలు, టీ ఆకులు, ఉల్లిపాయ తొక్కలు, ఎగ్‌షెల్స్‌తో చేసిన ఎరువుల నుండి తయారుచేసిన కంపోస్ట్‌ను జత చేస్తున్నారు. క్రమం తప్పకుండా ఆవు పేడను వర్మి కంపోస్టుకు కలుపుతున్నారు.
   శీతాకాలంలో బ్రోకలీ, క్యాబేజీ నుండి టర్నిప్స్‌, క్యారెట్ల వరకూ అన్ని రకాల పంటలనూ పండిస్తున్నారు. వివిధ రకాల ఆకుకూరలతో పాటు. అలంకార మొక్కలనూ పెంచుతున్నారు. ఇందులో సాధారణ రెయిన్‌ లిల్లీస్‌ నుండి ఆసియా, బౌగెన్విల్లెయాస్‌, జాస్మిన్స్‌, క్రీప్‌ మిర్టల్స్‌, మందార, పాషన్‌ ఫ్లవర్‌ వంటి అనేక రకాల పూల మొక్కలను పెంచుతున్నారు.

                                                    చేపల నీటి వ్యర్థాలతో మేడపై అరటి పెంపకం...

arati pempakam

   కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన జాన్‌ వర్గీస్‌ తన మేడమీద 2019లో ఆక్వాపోనిక్స్‌ ప్రయోగాల ద్వారా టమోటా, వంకాయ, పాలకూర, అలాగే అరటి చెట్టు వంటి అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం, వర్గీస్‌ (30) తన ఇంటి టెర్రస్‌ మీద టమోటాలు, వంకాయలతో సహా కొన్ని మొక్కలను పెంచడం ప్రారంభించాడు. మార్కెట్లలో విక్రయించే కూరగాయలపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరారు. ''కేరళ వినియోగదారుల రాష్ట్రమని, ఇది ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు, పండ్లను ఎగుమతి చేస్తుందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నారు. అయితే బయటి ఉత్పత్తుల్లో పురుగుమందులు, ఇతర హానికరమైన రసాయనాలు ఉంటాయి. అందువల్ల తానే స్వయంగా ఆర్గానిక్‌ వంగడాలను పెంచుకోవడం మొదలుపెట్టాను' అని జాన్‌ చెబుతున్నారు.
    రెండు సంవత్సరాల తరువాత, అతను ఆక్వాపోనిక్స్‌తో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అయితే సాధారణంగా మొక్కలను నేలలో పండిస్తారు. కానీ ఆక్వాపోనిక్స్‌లో నీటి ద్వారా పోషకాలు అందిస్తూ మొక్కలు పెంచుతారు. ఇందుకు భిన్నంగా చేపలు, వాటి వ్యర్థాలు, అవి నివసించే నీటి ద్వారా జాన్‌ సాగు మొదలుపెట్టారు. ఒకప్పటి జాన్‌ ప్రయోగం నేడు విజయవంతమైంది. జాన్‌ తన మేడమీద అరటి చెట్లతో సహా పలు రకాల మొక్కలను పెంచుతున్నాడు. ఇతను త్రిస్సూర్‌లో ఇండోర్‌ ప్లాంట్లను విక్రయించే గ్రోసెరీస్‌ యజమాని.

                                                              వారం రోజుల ప్రక్రియ

arati pempakam

   2019 జాన్‌లో ఆక్వాపోనిక్స్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. స్నేహితుడి సహాయంతో తయారుచేసిన 800 లీటర్ల గ్రో బెడ్‌ని ఏర్పాటు చేశాడు. ఓపెన్‌ టెర్రస్‌ మీద గాలి పీడనాన్ని తట్టుకునేందుకు దీనికి 'ఫాబ్రిక్‌ కోటెడ్‌ పివిసిని' ఉపయోగించాడు. గ్రో బెడ్‌ అడుగున రంధ్రాలు, మెష్‌ ఫిల్టర్లను చొప్పించాడు. దీనికి నీటి పైపు ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌ కోసం రెండు రంధ్రాలు ఏర్పాటు చేశాడు జాన్‌.
   మట్టి మాధ్యమం శుభ్రంగా, రసాయన రహితంగా ఉండాలి.. కాబట్టి జాన్‌ హైదరాబాద్‌ నుండి సేకరించిన క్వార్ట్‌జ్‌ సిలికా ఇసుకను ఉపయోగించాడు. సాధారణ బంకమట్టి, ఇసుక నీటి స్థాయిలను మారుస్తుంది. ఇది చేపలతో పాటు మొక్కలకూ హానికరం. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 500 లీటర్ల ఫిష్‌ ట్యాంక్‌ను ఉంచి తిలాపియా చేపలను పెంపకం ప్రారంభించాడు. వాటిని 'పూప్‌ ఫిష్‌' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ చేపల వ్యర్థాలు మొక్కలకు ఏంతో మేలు చేస్తాయి అని జాన్‌ చెబుతున్నారు. ప్రస్తుతం అతను ట్యాంక్‌లో 80 చేపలను పెంచుతున్నారు. అయితే మొక్కల సంఖ్యను బట్టి ఈ సంఖ్యను మార్చవచ్చు.
   ఫిష్‌ ట్యాంక్‌ నుండి మేడ మీదకు నీరు వెళ్లేందుకు 60 వాట్ల మోటారు బిగించాడు. రోజుకు మూడు సార్లు అరగంటపాటు నీటి ప్రసరణ జరిగేలా చేస్తుంది. 'ఈ బెడ్‌లో చేపల నీరు మొదట ఇసుక ద్వారా ఫిల్టర్‌ చేయబడుతుంది. ఇక్కడ ఘన వ్యర్థాలను ఉపరితలం వద్ద సేకరిస్తారు. అప్పుడు నీరు చక్కటి మెష్‌ ఫిల్టర్‌ గుండా వెళుతుంది. ఇది ఇసుక రేణువులను సేకరిస్తుంది. చివరగా, స్వచ్ఛమైన నీటిని తిరిగి చేపల తొట్టెకు మళ్ళిస్తారు' అని జాన్‌ చెబుతున్నారు.
 

                                                          అరటి చెట్ల పెంపకం...

   ప్రారంభంలో జాన్‌ పాలకూర, ఎరుపు అమరాంథస్‌, కొత్తిమీర వంటి ఆకు కూరలను, అలాగే టమోటా, వంకాయతో సహా పలురకాల కూరగాయల మొక్కలను పెంచాడు. నాలుగు నెలల క్రితం, తన పెరటి తోటలో అరటి చెట్టు పెరగడాన్ని అతను చూశాడు. అప్పుడే ఆక్వాపోనిక్స్‌ ఉపయోగించి తన మేడమీద అరటిచెట్లను పెంచుకోవచ్చని నిర్ధారణకు వచ్చాడు. అయితే అరటి చెట్టు పెరుగుదలకు అదనపు పోషకాలు, సేంద్రియ ఎరువులు లేదా పురుగుమందులను జోడించలేదని చెబుతున్నాడు.
 

                                                                   ముగింపు

  నిజంగానే చెప్పాలంటే చెట్లు మనకు ఎంతగానో మేలు చేస్తున్నాయి. ఎప్పుడైనా తలనొప్పి వస్తే... ఓ 40 నిమిషాల పాటూ... మొక్కలు, చెట్ల మధ్య నడుస్తూ వెళ్లండి... కచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకంటే... చెట్లు ఇచ్చే ఆక్సిజన్‌ మీ బ్రెయిన్‌లోకి ఎక్కువగా వెళ్తుంది. దాంతో అక్కడి రక్త ప్రసరణ జోరందుకొని... ఆక్సిజన్‌తో మెదడులో కణాలన్నీ చల్లబడతాయి.
   సాధారణంగా రోడ్డుపైన, లేదా మైదాన ప్రాంతాల్లో వెళ్లే సమయంలో ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయి. అయితే అలా మధ్యలో ఏదైనా చెట్టు కింద మాత్రం చాలా సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అందుకే అనేక మంది ప్రయాణికులు మధ్యాహ్న సమయంలో చెట్ల కింద సేదతీరతారు.
   ఇలా చెప్పుకుంటూ పోతే కాలుష్యాన్ని తగ్గించడంలోనూ... ఉష్ణోగ్రతలను తగ్గించడలోనూ.. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలోనూ... ప్రకృతి ప్రళయాలను తగ్గించడంలోనూ చెట్లు కీలక పాత్రను పోషిస్తుంటాయి. మరి అలాంటి చెట్లను నాటి వాటిని వనాలుగా మలచి వీరంతా ప్రకృతికి ఎంతో మేలుచేస్తున్నారు.

- ఉదయ్‌ శంకర్‌ ఆకుల