Apr 18,2023 23:32

రైతులతో మాట్లాడుతున్న నైరా వ్యవసాయ విద్యార్థులు

ప్రజాశక్తి-కె.కోటపాడు
రసాయనక ఎరువులు వినియోగించి భూమి సారాన్ని పాడు చేయకుండా, వాటి స్థానంలో పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలని శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులకు సూచించారు. మండలంలోని సింగన్నదొరపాలెంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల భూమి సారాన్ని పెంచి మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. పచ్చిరొట్ట ఎరువులపై రైతులకు అవగాహన లేకపోవడంతో అధిక మొత్తంలో రసాయనకు ఎరువులు వాడుతున్నారని తెలిపారు. జీలుగ, జనుము విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, వాటిని పొలాల్లో వెదజల్లి పంట కాలంలో నేలలో కలిసిపోయేటట్లు కలియుదున్నడం వల్ల భూసారం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆధునిక వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు పుష్ప మంజరి, ఉమ, స్నేహలత, తేజేశ్వరి పాల్గొన్నారు.