Nov 22,2022 00:08

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ

ప్రజాశక్తి - చోడవరం
రాష్ట్ర అభివృద్ధిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ విమర్శించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి యోచిస్తున్నారని తెలిపారు. దీనికి విరుద్ధంగా కర్నూల్‌లో హైకోర్టు నిర్మించాలని తానే ప్రతిపాదించినట్లు చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. రాయలసీమ ప్రాంతం వారు ఉత్తరాంధ్ర వచ్చి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఇక్కడ చెబుతూ, రాయలసీమలో మాత్రం అభివృద్ధి నేనే చేశానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణి విడనాడాలని హితవుపలికారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, లక్ష 75 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లోకి జమ చేసిందని తెలిపారు. వీటిని చూడలేని టిడిపి ప్రభుత్వంపై బురదజల్లుతోందని ఆరోపించారు. టిడిపికి కాలం చెల్లిందని పేర్కొన్నారు.