Nov 24,2022 23:46

క్వారీని పరిశీలిస్తున్న సిపిఎం నేత గోవిందరావు

ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలోని కొవ్వూరు పంచాయతీ ఎదురువలస రెవెన్యూ పరిధిలో నల్లరాయి క్వారీని సిపిఎం ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, మండల కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, కొవ్వూరులో మూడు క్వారీల పర్యావరణ అనుమతుల కోసం ఒక్కో రోజు ప్రజల అభిప్రాయాలు చెప్పడం అన్యాయమన్నారు. నేటికీ క్వారీ అనుమతులు తీసుకొని 12 సంవత్సరాలైనా క్వారీ నిబంధన ప్రకారం క్వారీ ప్రదేశంలో రాయి గోడ నిర్మించలేదన్నారు. నల్లరాయిను భారీ వాహనాల ద్వారా 45 టన్నులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వెళ్లడంతో దుమ్ము ధూళి రావడంతో ప్రజలకు శ్వాసకోస వ్యాధులు బారిన పడుతున్నారన్నారు. నేటికీ కూడా క్వారీ అభివృద్ధి నిధుల నుండి గ్రామాలకు మంచినీరు, మెడికల్‌ క్యాంపు వంటి సౌకర్యాలు కల్పించ లేదన్నారు. పర్యావరణ శాఖ అధికారులు, మైన్స్‌ డిపార్టుమెంట్‌ అధికారులు నల్లరాయి క్వారీ యాజమాన్యంతో కుమ్మక్కవడంతో నిబంధనలు పట్టించుకో లేదన్నారు. ఈనెల 25న జరిగే పబ్లిక్‌ హియరింగ్‌లో ప్రజల తన అభిప్రాయాలు చెప్పాలని కోరారు.