ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రధాన మంత్రి టి.బి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిర ఆవరణలో క్షయ వ్యాధి గ్రస్తులకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరులు పౌష్టికాహార కిట్లను పంపిణీచేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి నివారించడంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్చంధ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు పోష్టికాహారాన్ని అందించి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చి దిద్దెందుకు కషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశామన్నారు. క్షయ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అందరిలోనూ అంతర్గతంగా ఉంటాయని ఐతే అనారోగ్యంతో రోగ నిరోధక శక్తీ బలహీనంగా ఉన్న వారిలో క్షయ వ్యాధికి సంభందించిన బాక్టీరియా వద్ధితో లక్షణాలు బయటపడతాయన్నారు. క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచవచ్చునన్నారు. జిల్లాలో రెండువేల మంది వరకు క్షయ వ్యాధి బాధితులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు తెలుపుతున్నాయని వారందరికీ పౌష్టికాహారాన్ని, మందులను అందించడం ద్వారా క్షయ వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. అధికారులు కూడా క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం అందించడం లో ఆర్ధికంగా చేయూతనందించడం శుభపరిణామమని, ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి నియంత్రణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. పౌష్టికాహార పంపిణి కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం.సుహసిని, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా. జె.ఉషారాణి, టి.బి.యూనిట్ పర్యవేక్షకులు ఉన్నారు
మాతాశిశుమరణాలపై దృష్టి సారించాలి : కలెక్టర్
మాతాశిశు మరణాలు నమోదు కాని జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హైరిస్క్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాతాశిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో మాతృ మరణాల నివారణలో భాగంగా రూపొందించిన హై రిస్క్ గర్భిణీ స్త్రీల రిఫెరల్ పుస్తకాలను కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరు, డిప్యూటీ కలెక్టర్ జ్యోతి సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలను నివారించేందుకు గర్బీణీలో ప్రమాద లక్షణాలు ఎక్కువ కలవారిని (హై రిస్క్ ) ముందుగా గుర్తించి వారిని ప్రసవానికి ముందుగానే దగ్గరలో వున్న మాతా శిశు నిపుణులు కలిగిన ఆసుపత్రులుకు తరలించే పక్రియలోభాగంగా హెరిస్క్ గర్బీణీ తరలింపు రిజిస్టర్లు ఉపయోగపడతాయన్నారు. మాతా శిశు సంరక్షణ లో జిల్లాను ప్రధమ స్థానంలో నిలపాలని, మాత మరణాలు సంభవించని జిల్లాగా ఉండేలా కషి చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రమాదకర లక్షణాలు కలిగిన గర్భిణీ లను ముందుగానే గుర్తించి తగిన కార్యాచరణ ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణకు దోహద పడవచ్చునని కలెక్టర్ పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మరణాల నివారణకు ముందస్తు ప్రణాళికతో హై రిస్క్ గర్భిణీస్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ జె. సునీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం.సుహసిని, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, లక్ష్మి కుమారి ఉన్నారు.










