రాయచోటి : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుబాటులో ఉండి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి మిద్దింటి ధనలక్ష్మి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పనితీరు అంగనవాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఎలా అందించాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆమె వివరించారు.
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాల వివరాలు తెలపండి?
జిల్లాలో 11 ఐసిడిఎస్ ప్రాజెక్టులున్నాయి. బి కొత్తకోట, చిట్వేలి, లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, టి. సుండుపల్లె, తంబళ్లపల్లి, వాల్మీకిపురం ప్రాంతాలలో ఉన్నాయి. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిక అధికారి కార్యాలయం రాయచోటి జిల్లా కేంద్రంలో ఉంది.
ఐసిడిఎస్ పని వివరాలు తెలపండి?
ఐసిడిఎస్ పరిధిలో రోజూ ఉదయం 9 గంటలకు అంగన్వాడీ కేంద్రాలను తెరవడం, మూడేళ్ల నుంచి (ప్రీ స్కూల్ పిల్లలకు) 11:00 గంటలకు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వడం, ప్రభుత్వ నియమ నిబంధనలను ప్రకారం ప్రీ స్కూల్ యాక్టివిటీస్ (పిపి-1,పిపి-2) జరపడం, వారికి ఆటపాటలు నేర్పడం, సాయంత్రం 3:00 గంటలకు 100 మిల్లీ లీటర్లపాలు ఇవ్వడం, 4:00 గంటలకు అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తారు. . 7 నెలల నుంచి 3 సంవత్సరముల పిల్లలకు బాలామతం 2.5 కేజీలు, 25 గుడ్లు, 1.5లీటర్ల పాలు టిహెచ్‌ఆర్ ద్వారా ఇంటికి ఇస్తూ వారి తల్లితండ్రులకు వాటి పోషకాల గురించి అవగాహన కల్పిస్తారు. ఇంకా గర్భిణులకు, బాలింతలకు పది రకాల పోషక విలువలు కల్గిన బలవర్ధక ఆహార పదార్థాల కిట్‌ను అందజేస్తారు. వారికి రక్తహీనత లేకుండా చూడడం, 7 నెలలనుంచి 3 సంవత్సరము ల పిల్లలకు పోషకాహార లోపం లేకుండా చూడడం, వారికి బలవర్ధక ఆహారం అందించడం, పిల్లలకు ఒకపూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం పెడుతారు. ప్రతి మొదటి శుక్రవారం, మూడవ శుక్రవారం ఆరోగ్య పరపైన హెల్త్ చెక్ అప్‌లు చేయిస్తూ ఆశా వర్కర్, ఎఎన్‌ఎం, మెడికల్ ఆఫీసరుతో తగిన సలహాలు ఇప్పించడం, పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించడం జరుగుతుంది.
జిల్లా వ్యాప్తంగా ఖాళీల పోస్టుల వివరాలు తెలపండి?
అంగన్వాడీకార్యకర్తలు 8, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 7, అంగన్వాడీ సహాయకురాళ్లు 22, అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బాల్య వివాహాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
బాల్యవివాహాలను నివారించడానికి జిల్లా ,మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. అంగన్వాడీి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి గ్రామాలలో పాఠశాలలో బాలికలు హాస్టల్లో పిల్లలకు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
ఐసిడిఎస్ అదనపు కార్యాలయాలకు ప్రతిపాదన ఏమైనా పంపారా?
లేదు, జిల్లలో సరిపడా ప్రాజెక్టులు ఉన్నాయి.
గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు సలహాలు ఏమైనా ఇవ్వాలను కుంటున్నారా?
అంగన్వాడీ కేంద్రం ద్వారా సరఫరా చేసిన ఫౌష్ఠికాహారం గర్భిణులు, బాలింతలు క్రమం తప్పక తీసుకోవడం, అంగన్వాడీ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన తగు సూచనలు, సలహాలు పాటించడం. వారి కుటుంబ సభ్యులు కూడా వారికి సహకరించాలనికోరుతున్నాం.ఐసిడిఎస్ పీడీ ఎం ధనలక్ష్మి