Mar 07,2021 14:34

చనా మసాలా..
కావాల్సిన పదార్థాలు : తరిగిన ఉల్లిపాయలు - కప్పు, తరిగిన టమాటా - కప్పు, అల్లం - చిన్న ముక్క (తరిగినది), వెల్లుల్లి - నాలుగు రెబ్బలు (తరిగినది), చిలీ మిరియాలు - ఒకటి (పొడి), ఆలివ్‌ ఆయిల్‌ - మూడు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, కారం - టీ స్పూన్‌, దనియాల పొడి - టీ స్పూన్‌, గరమ్‌ మసాలా - టీ స్పూన్‌, పసుపు - 1/2 టీ స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - తగినంత, చిక్‌పీస్‌ (శనగలు) - 450 గ్రాములు, కొత్తిమీర - టీ స్పూన్‌.
తయారుచేసే విధానం : ఉల్లి తరుగు, టమాటా, అల్లం, వెల్లుల్లి, చిలీ పెప్పర్‌ను మిక్సీ పట్టి, మెత్తని పేస్టుగా తయారుచేసుకోవాలి.

  • పొయ్యిమీద పాన్‌ పెట్టాలి. ఇందులో ఆలివ్‌ ఆయిల్‌ పోసి వేడెక్కనివ్వాలి. ఇందులో కరివేపాకు రెబ్బలు వేయాలి. సువాసన వచ్చే వరకూ 30 సెకన్లపాటు ఉంచాలి.
  • ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఈ మిశ్రమంలో కారం, ధనియాల పొడి, గరమ్‌ మసాలా, పసుపు, ఉప్పు రుచికి తగినంత వేసి, బాగా కలియతిప్పాలి.
  • మరో గిన్నెలో శనగలను ఉడకబెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి.
  • ఉడకబెట్టిన శనగలను మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అవసరమైన మేరకు కొద్దిగా నీరు పోసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉంచాలి.
  • శనగలు బాగా ఉడికి గుజ్జు ఏర్పడే వరకూ ఉంచాలి.
  • సన్నని మంటపై ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే వేడి.. వేడి రుచికరమైన చనా మసాలా రెడీ..
  • దీన్ని అన్నంతోగానీ, బటర్‌నాన్‌తో గానీ సర్వ్‌ చేసుకోవచ్చు.

పోషక విలువలు..
శక్తి - 413 క్యాలరీలు, ప్రోటీన్లు-9.4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు-46.2 గ్రాములు, ఫ్యాట్‌- 22.8 గ్రాములు, సోడియం- 524.9 మిల్లీ గ్రాములు.

హరియాలీ దాల్‌..


హరియాలీ దాల్‌..
కావాల్సిన పదార్థాలు : ఎర్ర కందిపప్పు - 1/2 కప్పు, బచ్చలకూర (ప్యూరీ) - 3/4 కప్పు, జీలకర్ర - 1/2 టీ స్పూన్‌, ఇంగువ - రుచికి తగినంత, మెంతికూర - 1/2 కప్పు, పచ్చిమిర్చి - 2 (తరిగినవి), ఉల్లిపాయ తరుగు - 3/4 కప్పు, అల్లం పేస్టు - టీ స్పూను, వెల్లుల్లి పేస్టు - 1/2 టీ స్పూను, గరమ్‌ మసాలా - 1/2 టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను, పాలు - 1/4 కప్పు, నూనె - టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం : ముందుగా ఎర్ర కందిపప్పుని కుక్కర్‌లో వేసి, తగినన్ని నీళ్లుపోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయేవరకూ ఉంచాలి.

  • పాన్‌ తీసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. నూనె వేసి కొద్దిగా వేడెక్కాక జీలకర్ర, ఇంగువ, మెంతికూర వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
  • ఇందులో పచ్చిమిచ్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టులు వేసి బాగా కలుపుకోవాలి.
  • రెండు నిమిషాల తర్వాత గరమ్‌ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • సన్నని మంట మీద నిమిషం పాటు ఉంచిన తర్వాత బచ్చలికూర గుజ్జు, పాలు, కొద్దిగా నీరు పోసి బాగా కలుపుకోవాలి.
  • మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన ఎర్ర కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి, ఐదు నిమిషాలపాటు తిప్పుతూ ఉడకనివ్వాలి.
  • అంతే ఎంతో రుచికరమైన హరియాలీ దాల్‌ రెడీ.. దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్‌ చేసుకోవచ్చు..

పోషక విలువలు..
శక్తి -122 క్యాలరీలు, ప్రోటీన్లు- 6 గ్రా, కార్బోహైడ్రేట్లు-18.5 గ్రా, ఫైబర్‌ -4.1 గ్రా, కొవ్వులు-0 శాతం, సోడియం-28.8 మి.గ్రా

హరియాలీ దాల్‌..


కుల్తీ దాల్‌ :
కావాల్సిన పదార్థాలు : ఉలవలు - 1/2 కప్పు, నీళ్లు - 3 కప్పులు, పసుపు - టీ స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - టీ స్పూన్‌, ఆవాలు - 1/2 టీ స్పూన్‌, జీలకర్ర - 1/2 టీ స్పూన్‌, ఇంగువ - 1/4 టీ స్పూన్‌, అల్లం, వెల్లుల్లి పేస్టు - టీ స్పూన్‌, ఉల్లిపాయల - ఒకటి (తరిగినది), టమాటా - ఒకటి (తరిగినది), కారం - టీ స్పూన్‌, ధనియాల పొడి - టీ స్పూన్‌, కొత్తిమీర - కప్పు.
తయారుచేసే విధానం : ఉలవలను ముందురోజు రాత్రి నీళ్లలో నానబెట్టుకోవాలి.

  • మరుసటి రోజు వీటిని కుక్కర్‌లో వేసి, మూడు కప్పుల నీరు పోసి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి.
  • ఆరు నుంచి ఏడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉంచాలి. ఆవిరి పూర్తిగా పోయే వరకూ ఉడకనివ్వాలి.
  • పొయ్యి మీద పాన్‌ పెట్టుకుని, నెయ్యి వేయాలి. సన్నని మంటపై నెయ్యి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి.
  • ఇందులో ఇంగువ వేసి బాగా కలపాలి.
  • తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
  • దీనిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి.
  • తర్వాత ముందుగా ఉడకబెట్టిన ఉలవలను మెత్తగా మెదుపుకుని పాన్‌లో వేయాలి. ఇప్పుడు పాన్‌పై మూతపెట్టి నాలుగు నిమిషాల సిమ్‌లో మిశ్రమంతో కలిపి ఉడకనివ్వాలి.
  • తర్వాత పొయ్యి కట్టేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే... ఘుమ..ఘుమలాడే కుల్తీ దాల్‌ రెడీ..
  • ఇప్పుడీ కుల్తీ దాల్‌ని పుల్కాతోగానీ, అన్నంతోగానీ సర్వ్‌ చేసుకోవచ్చు.

పోషక విలువలు..
శక్తి - 321 క్యాలరీలు, ప్రోటీన్లు -22 గ్రా
కార్బోహైడ్రేట్లు - 57 గ్రా, ఐరన్‌ - 7 మి.గ్రా, క్యాల్షియం-287 గ్రా, కొవ్వులు-0 శాతం , ఫైబర్‌-5 గ్రా, ఫాస్పరస్‌-311 గ్రా