Apr 24,2023 21:26

ధాన్యం కొనుగోలులో రైతులకు చుక్కలు
లారీల ఏర్పాటులో ఖరీఫ్‌ నుంచి ఏమాత్రం నేర్వని పాఠాలు
ఏలూరు జిల్లాలో దాదాపు 50 శాతానికిపైగా మాసూళ్లు పూర్తి
కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 25 వేల మెట్రిక్‌ టన్నులే
కళ్లాల్లోనే పంట.. అకాల వర్షాలతో రైతులకు దడ
ఉంగుటూరు, పూళ్ల, గుండుగొలనులో రోడ్డెక్కిన అన్నదాత
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

పౌర సరఫరాల శాఖాధికారులు రైతుల గురించి ఆలోచిస్తున్నారా.. లారీల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు. ఖరీఫ్‌లో ఎదురైన లారీల సమస్యను రబీలోనూ ఎందుకు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. లారీలు లేక లక్షల టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉండటానికి పౌరసరఫరాల శాఖాధికారులు కారణం కాదా.. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే పౌరసరఫరాల శాఖాధికారులు బాధ్యత వహిస్తారా.. రైతుల సమస్యను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తమకే అన్నీ తెలుసు అనే ధోరణిలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వ్యవహరించడమే దీనికి కారణమా అనే ఆలోచన ఏలూరు జిల్లాలోని రైతాంగాన్ని వెంటాడుతున్న పరిస్థితి నెలకొంది.
ధాన్యం కొనుగోలులో పౌర సరఫరాల శాఖాధికారుల తీరు రైతుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలులో వెంటాడుతున్న సమస్యలతో రైతులు విసిగిపోతున్నారు. అధికారుల తీరు కారణంగా అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుండటంతో అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. లారీలు పంపి ధాన్యం తరలించాలంటూ సోమవారం నాడు ఉంగుటూరు, పూళ్ల, గుండుగొలనులో రైతులు ఆందోళనకు దిగి, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. రైతులను ఆదుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నడిచే ఏలూరు స్పందన కార్యక్రమంలో ఎపి రైతుసంఘం నాయకులు వినతిపత్రం అందించారు. ధాన్యం కొనుగోలులో పౌరసరఫరాల శాఖ రైతుల గోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఖరీఫ్‌లో సమస్యలే రబీలోనూ పునరావృతమవుతున్న తీరు ఆ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందనే చర్చ రైతుల్లో సాగుతోంది. ధాన్యం వెంటనే తరలించకపోతే చావే శరణ్యమంటూ పురుగుమందుల డబ్బాలతో రైతులు నిరసనకు దిగిన పరిస్థితి రావడం అత్యంత దారుణంగా చెప్పొచ్చు. రబీలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.13 లక్షల ఎకరాల్లో, ఏలూరు జిల్లాలో 79,448 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఇప్పటి వరకూ ఏలూరు జిల్లాలో 50 శాతానికిపైగా 40,860 ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి. కొన్ని మండలాల్లో 60, 70 శాతం కూడా మాసూళ్లు పూర్తయిన పరిస్థితి ఉంది. పశ్చిమలో 30 శాతం పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పశ్చిమలో కంటే ఏలూరు జిల్లాలో రబీలో వరిసాగు దాదాపు లక్షా 50 వేల ఎకరాలు తక్కువ. ఏలూరు జిల్లాలో సాగు చేసిన వరి పంటకు సంబంధించి 3.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ ధాన్యం కొనుగోలుకు కూడా పౌరసరఫరాలశాఖ పిల్లిమొగ్గలు వేస్తోంది. ఇప్పటి వరకూ 50 శాతానికిపైగా పూర్తయిన మాసూళ్ల ప్రకారం చూస్తే దాదాపు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉంది. ఇప్పటి వరకూ ఏలూరు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యం కేవలం 25 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ఇంకా కళ్లాల్లో లక్షా 75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
లారీల సమస్య ఎప్పటికి తీరేనో..
ఈ నెల 16న ధాన్యం కొనుగోలును అధికారులు ప్రారంభించారు. అంటే దాదాపు పది రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకూ లారీల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. లారీల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకపక్క అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. సోమవారం ఏలూరుతోపాటు పలుచోట్ల వర్షాలు కురిశాయి. మబ్బులు, గాలులతో నిండిన వాతావరణం రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. ధాన్యం తడిస్తే రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. ముఖ్యంగా నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు వంటి మండలాల్లో కొల్లేరు పొలాలు ఎక్కువగా ఉన్నాయి. ధాన్యం తడిస్తే ఇక్కడి రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. పౌరసరపరాలశాఖ అధికారులు ఇప్పటికైనా లారీల సమస్యను పరిష్కరించి రైతులకు మేలు చేయాలని అంతా కోరుతున్నారు.