అనంతపురం ప్రతినిధి : మేధావులు, రచయితలు, జర్నలిస్టులపై కేంద్ర నిఘా సంస్థ జరుపుతున్న దాడులను అనంతపురం జిల్లాలోని పౌర సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. జిల్లాలో అబ్దుల్ రసూల్, చంద్రశేఖర్‌లపై జరిపిన దాడిని ఖండిస్తూ వారికి అండగా నిలుస్తామని సంఘీభావం తెలిపారు. అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి, ఎస్‌యుసిఐసి, వైసిపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీల నాయకులతోపాటు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జిల్లాలో అబ్దుల్ రసూల్, చంద్రశేఖర్ నాయకుల ఇళ్లలో ఎన్‌ఐఎ దాడులు చేయడాన్ని అందరూ సంయుక్తంగా ఖండించారు. ఇద్దరు నాయకులు కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరుపున నిలబడే నాయకలేనని చెప్పారు. మానవ హక్కుల కోసం నిలబడి నాయకులను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఐఎ దాడులు చేయడం సహించరానిదని ఖండించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి ఒక పథకం ప్రకారమే మేధావులు, రచయితలు, ప్రజాస్వామికవాదుల ఇళ్లపై ఇటువంటి దాడులు చేస్తోందని విమర్శించారు. గాంధీ జయంతి రోజున దేశ వ్యాప్తంగా 200కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందన్నారు. ఇది ప్రజాస్వామిక గొంతుకల నొక్కే ప్రయత్నంలో భాగమేనని చెప్పారు. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులందరూ నినదించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి నియంత్రుత్వంగా ఉందని చెప్పారు. అబ్దుల్ రసూల్, చంద్రశేఖర్‌లు ఇద్దరూ ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడేవారు తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండేవారు కాదని అన్నారు. అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితుల్లో లేకపోవడం శోచనీయమన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి మాట్లాడుతూ దేశంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నంలో భాగమే కేంద్రం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముందు నుంచి పాలకులు ప్రశ్నించే గొంతకలను అణచివేస్తూ వస్తున్నాయన్నారు. గతంలో ఎమర్జెన్సీ పేరుతోనూ ఇటువంటి ప్రయత్నాలే జరిగాయని గుర్తుచేశారు. సిపిఎం రాష్ట్ర నాయకులు జి.ఓబుళు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద విధానాలను బిజెపి అమలు చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే వారి విధానాలను ప్రశ్నించే పౌర హక్కులు, ప్రజాస్వామిక వాదుల ఇళ్లపై దాడులు చేసి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సమిష్టిగా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. ఎస్‌యుఎస్‌ఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బిజెపి ఈ రకమైన దాడులకు పాల్పడుతూ భయోత్పాతాన్ని ప్రశ్నించే వారిలో సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు దాదా గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులపై జరుగుతున్న దాడులను ఖండించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నిలబడుతుందని చెప్పారు. వైసిపి నాయకులు ఎకెఎస్ ఫయాజ్ బాషా మాట్లాడుతూ అబ్దుల్ రసూల్, చంద్రశేఖర్‌లపై జరిగిన దాడిని ఖండించారు. వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నుంచి నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎన్‌ఐఎ దాడులను ఖండిస్తూ తీర్మానం చేశారు. అదే విధంగా అబ్దుల్ రసూల్, చంద్రశేఖర్‌లకు సంఘీభావాన్ని తెలుపుతూ తీర్మానం చేశారు.
ప్రజాస్వామికవాదులుగానే ఉంటాం : చంద్రశేఖర్
ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నంగానే ఎన్‌ఐఎ దాడులను చూస్తానని చంద్రశేఖర్ చెప్పారు. తమ ఇంట్లో సోదాలు నిర్వహించి తీసుకెళ్లి పుస్తకాలు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుందన్నారు. వారు పట్టుకెళ్లిన పుస్తకాలేమిటంటే జిల్లాలోని కమ్మూనిస్టు నాయకులైన ఐదుకల్లు సదాశివన్, నీలం రాజశేఖర్ జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలని చెప్పారు. అవి బహిరంగంగా అన్ని చోట్లా లభించే పుస్తకాలేనని చెప్పారు. నిషేధిత పుస్తకాలేవి తమ వద్దలేవని అన్నారు. దశబ్ధాలుగా ఇక్కడ ప్రజలతో కలసి అనేక సమస్యలపై పోరాటం సాగించామని తెలిపారు. తామేదేది రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, ఇది విషయం జిల్లా వాసులందరికీ తెలిసిందేనని వివరించారు.
తమకు తెలిపిన సంఘీభావానికి ధన్యవాదాలు :అబ్దుల్ రసూల్
ఎన్‌ఐఎ అధికారులు తమ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే ఏ ఒక్క వస్తువు లభించలేదని అన్నారు. చివరకు మొబైల్‌ఫోన్ సీజ్ చేసుకుని వెళ్లారని తెలిపారు. ప్రజల తరుపు, వారి సమస్యలపై గళం విప్పడాన్ని ప్రభుత్వం సహించడం లేదని అన్నారు. అయితే ఈ సందర్భంగా జిల్లావాసులు నుంచి పెద్దఎత్తున సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.










