
ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలో ప్రతి మండలంలో పౌర హక్కుల దినోత్సవం తప్పక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ హక్కుల బాధితులకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించినందుకు సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ హక్కుల ఉల్లంఘన కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు కేసుల పరిష్కారం, కొత్తగా నమోదైన కేసులను గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన సమీక్షించారు. లీగల్ ఒపీనియన్ అంశాలను తక్షణం పూర్తి చేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలపై వచ్చిన చార్జిషీట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం తీసుకున్న చర్యలను సమీక్షించారు. జిల్లాలో నిఘా ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలపై ఎటువంటి హక్కుల ఉల్లంఘనను జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌పి మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డిఆర్‌ఓ వెంకటరమణ, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు చిన్ని కృష్ణ, జయరాం, డీఎస్పీలు మహేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు కే.అప్పారావు, ఎం. అప్పలరాజు, ఆర్.మధు బాబు, ఎం. ఈశ్వరరావు, జి మరియమ్మ, డిపిఓ శిరీష రాణి, హార్టికల్చర్ ఏడి ప్రభాకర్ రావు, డిఐపిఆర్‌ఓ ఇంద్రావతి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కెవి.రమణ, బి.అప్పారావు, జే.తరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.