Oct 05,2023 21:22

సమ్మె శిబిరంలో కార్మిక నాయకులతో చర్చిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-చీపురుపల్లి :  మండలంలోని కర్లాం గ్రామం పరిధిలో గల వెంకట్రామ పౌల్ట్రీస్‌ లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతన ఒప్పందం సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో యాజమాన్యం దిగొచ్చింది. వేతన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించడంతో కార్మికులు సమ్మె విరమించారు.ఈ పౌల్ట్రీ లో పనిచేస్తున్న కార్మికులకు ఈ ఏడాది మే నెలతో వేతన ఒప్పందం సమయం ముగిసింది. జూన్‌ 1 నుంచి నూతన వేతన ఒప్పందం అమలు జరగాల్సి ఉంది. నూతన వేతన ఒప్పందం చేయాలని కోరుతూ ఏప్రిల్‌ 20న చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ నోటీసును యాజమాన్యానికి గంగా భవాని వెంకట్రామా పౌల్ట్రీ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన ఇచ్చారు. యాజమాన్యం వద్ద, డిసిఎల్‌ వద్ద గత నాలుగు నెలల కాలంలో 12 సార్లు చర్చలు జరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. గత నెల 8న కార్మికులంతా ఒకరోజు సమ్మె చేశారు. 14 నుంచి పౌల్ట్రీ పరిశ్రమ వద్ద రిలే నిరాహార దీక్షలు చేసారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులంతా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి దిగారు. స్థానిక ఎస్‌ఐ సన్యాసినాయుడు ఆధ్వర్యాన యూనియన్‌ ప్రతినిధులతోనూ, యాజమాన్య ప్రతినిధులతోనూ చర్చలు ఏర్పాటు చేశారు. ఈ చర్చల్లో వేతన ఒప్పందానికి యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది జూన్‌ నుంచి అమలు చేస్తామని తెలిపింది. ఏడాది పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా 200 మంది కార్మికులకు తక్కువ రూ.1900 నుంచి రూ.3200 వరకూ వేతనాలు పెరగనున్నాయి. చర్చలలో యాజమాన్య ప్రతినిధులు జిఎం హరికిషన్‌, హెచ్‌ఆర్‌ మేనేజరు అక్కిలనాయుడు, సతీష్‌, యూనియన్‌ ప్రతినిధులు టివి రమణ, ఎ.గౌరినాయుడు, ఐ. గురునాయుడు, ఈశ్వరరావు, గొల్లబాబు పాల్గొన్నారు. చర్చలు విజయవంతం కావటంతో సమ్మె విరమించి కార్మికులందరూ విధులకు హాజరయ్యారు.