Apr 02,2023 00:31

పౌల్ట్రీ కాంప్లెక్స్‌ దళిత రైతులతో మాట్లాడుతున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి-ఆనందపురం : ఆనందపురం మండల కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న పౌల్ట్రీ కాంప్లెక్స్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం సందర్శించారు. 1984లో ఎన్‌టి.రామారావు హయాంలో సుమారు 30 మంది ఎస్సీలకు పౌల్ట్రీ ఫారాలను కేటాయించారు. అప్పటి నుంచి కొన్నేళ్లు వారు కోళ్ల పెంపకాలు సాగించారు. హుదూద్‌ తుపాను కారణంగా షెడ్లు, విద్యుత్‌ స్తంభాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది షెడ్లును మరమ్మతులు చేసుకోగా, మరికొన్ని షెడ్లు పూర్తిగా శిథిలమై ఉన్నాయి. ఈ షెడ్లలో మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించాలని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దళితులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి షెడ్లను సందర్శించారు. అక్కడున్న పరిస్థితులను తెలుసుకొని, మౌలిక వసతులు కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం సేకరించి నివేదిక ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ముత్తం శ్రీనివాసరావును కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా జాయింట్‌ సెక్రెటరీ రామమూర్తి, జిల్లా విజిలెన్స్‌ మోనిటరింగ్‌ కమిటీ సభ్యులు బోనెల జోసెఫ్‌, ఆనందపురం తహశీల్దార్‌ లోకవరపు రామారావు, ఎంపిడిఒ లవరాజు, దళిత సంఘం సీనియర్‌ నాయకులు సింహాద్రి రాంబాబు, చెన్న సత్యం, శంకర్‌ పాల్గొన్నారు.