Oct 14,2023 20:49

పైసల్లేని పంచాయతీలు

రాయచోటి : మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నేడు నవ్వుల పాలవుతున్నది. పంచాయతీల అభివద్ధి జరిగితేనే జిల్లాలు, రాష్ట్రం ఎంతో అభివద్ధి పథంలో నడుస్తాయనే భావన అప్పట్లో ఉండేది. అన్నమయ్య జిల్లాలో 501 గ్రామ పంచాయతీలు ఉండగా, ఆరు గ్రామ పంచాయతీలో ఏకగ్రీవమైనవి. బి.కొత్తకోట మండలం గొల్లపల్లి పంచాయతీలో రూ.10 లక్షలు, పెద్దతిప్పసముద్రం మండలంలో కట్నగుల్ల గ్రామంలో రూ.10 లక్షలు, మదమూరు గ్రామంలో రూ.5 లక్షలు, నవాబకోట గ్రామంలో రూ.10 లక్షలు, రంగసముద్రం గ్రామంలో రూ.10 లక్షలు, వాల్మీకిపురం మండలంలో నగిరిమడుగు రూ.5 లక్షలు మొత్తం రూ.50 లక్షలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. కానీ నేడు మిగిలిన పంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన మారింది. మౌలిక వసతులు లేమితో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ముఖ్యంగా పారిశుధ్య పనులు, వీధిలైట్లు, సిసి రోడ్లు, మోటార్ల మరమ్మతులకు కూడా పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పనులు చేయలేక ఇబ్బందులు సర్పంచ్‌లు ఇబ్బంది పడుతున్నారు. వారి పరిధిలోని గ్రామాల్లో అరకొర సిసి రోడ్లు, పలు రకాల పనులు చేసి పనులకు రావాల్సిన బిల్లులు అందకపోవడంతో వడ్డీలు చెల్లించలేక అప్పుల బాధతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అప్పులు తెచ్చిన కాడ వడ్డీలు కట్టలేక వారు మాట్లాడే మాటలకు తలవంచి దయనీయమైన స్థితిలో ఉండాల్సిన పరిస్థితిలో సర్పంచులున్నారు. సర్పంచుల ఖాతాల్లో ఉండాల్సిన సొమ్మును ప్రభుత్వమే రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో నిధులు లేకుండా ఖాళీ చేసింది. సర్పంచ్‌లు ప్రభుత్వంపై విసిగి పోతున్నారు. వైసిపికి చెందిన సర్పంచ్‌లే నేడు ఎందుకు పార్టీలో ఉన్నామంటూ ఇప్పటికే రాజీనామాలు కూడా చేసి తిరుగుబాటు చేస్తున్నారు. చాలామంది సర్పంచ్‌లు రాబోయే రోజుల్లో ఇక ఎన్నికలకు దిగబోమంటూ చంపలేసుకుంటున్నారు. సర్పంచ్‌ పదవులు తమకొద్దని నిర్మొహమాటంగా చెప్పకనే చెబుతున్నారు. నేడు పంచాయతీలలో పనులు చేసేందుకు నిధులు లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న సంధాన ఉండిపోతున్నది. మేజర్‌ గ్రామ పంచాయతీలో ప్రజల నుండి చెత్త పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను పేర్లతో ఆ డబ్బులను ఖజానాకు జమ చేస్తూ కొంత సొమ్మును ధైర్యం చేసి పంచాయతీ పనులకు ఖర్చు చేస్తున్నారు. పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు కూడా సక్రమంగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలలో పెట్టిన ఖర్చులకు వడ్డీలు కూడా పనులు చేయలేకపోతున్నామని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నమయ్య జిల్లాలోని అన్ని మండలాల్లో పంచాయతీల పరిస్థితి ధైర్యంగా మారింది.
ఒక పని కూడా చేయలేదు
సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు గ్రామంలో ఒక పని కూడా చేపట్టలేదు. పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ నిధులు కూడా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్‌ కింద రూ.8,6,60 కోట్లను విడుదల చేసిన బడ్జెట్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంది. ఎన్నికలలో పెట్టిన డబ్బులకు కనీసం వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు గురవుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్పంచి గ్రాండ్లను విడుదల చేయాలి.
- పల్లపు వాసు, సర్పంచ్‌, పేమ్మడపల్లె, రాయచోటి.
ఆందోళన అవసరం లేదు
గ్రామ పంచాయతీలలో 15 ఫైనాన్స్‌ కింద ఒకసారి బడ్జెట్‌ విడుదల చేశారు. త్వరలో మరొక సారి 15 బడ్జెట్‌ను మంజూరు చేస్తాం. ఏకగ్రీవమైన పంచాయతీలలో బడ్జెట్‌ విడుదల చేశాం. గడప గడపలో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నాం. చేసిన పనులు కూడా బిల్లులు అందజేస్తున్నాం. రాబోయే రోజులలో మరింత గ్రామపంచాయతీలో అభివద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుం టున్నాం. సర్పంచ్‌లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-ధనలక్ష్మి, డిపిఒ, రాయచోటి.