
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పైర్లను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్.వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రస్తుతం వరి, పత్తి, మిర్చి పైర్లు వివిధ దశల్లో ఉన్నాయని, వర్షాభావం వల్ల నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న దృష్ట్యా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులను కోరారు. ప్రస్తుతానికి పంటలకు ఇబ్బంది లేదన్నారు. రబీలో పూర్తిగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని సూచించారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలియజేశారు.
జిల్లాలో వరి ఏ దశలో ఉంది?
జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. త్వరలో పాలుపోసుకునే దశలో చేరుకుంటున్నందున ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం డెల్టా పరిధిలో కాల్వలకు నీరు విడుదల చేస్తున్నారు. ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. చివరి భూములకు నీరు లభ్యమయ్యేలా నీటి పారుదలశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నీటి ఎద్డడి అంశాన్ని ఎప్పటికప్పుడు నీటి పారుదల అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం.
పత్తి పరిస్థితి ఏమిటి?
జిల్లాలో 45 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. ప్రస్తుతం మొదటి దశ తీతలకు చాలా ప్రాంతాల్లో పైరు సిద్ధంగా ఉంది. పత్తికి కాయలు, పూత బాగా వచ్చాయి. కొద్దిరోజుల్లోనే మొదటి తీతలు ప్రారంభమవుతాయి. కనీసం 4 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. పత్తికి కూడా వర్షాభావం ఏర్పడింది. కనీసం ఒకటి రెండు వర్షాలు పడితే పత్తి పూర్తి స్థాయిలో దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
మిర్చి సాగు ఎలా ఉంది?
జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. మిర్చికి నీటి అవసరం ఉంది. బెట్టకు రాకుండా రైతులు ఇప్పటికప్పుడు యూరియా ఎకరానికి ఒక కిలో, లేదా పొటాషియం నైట్రేట్ ఒక కిలో నీటిలో కలిపి పిచికారి చేయాలి. మనిషికి సిలైన్ ఎక్కించినట్టు పైరును బతికించుకునేందుకు ఈ విధంగా ప్రయత్నించాలి.
జిల్లాలో ఇతర పంటల సాగు ఎలా ఉంది?
మినుము 6250, సోయాబిన్ 1250, పసుపు 3750 ఎకరాల్లో సాగయ్యాయి. వర్షాభావం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా గతనెలలో కురిసిన వర్షాలతో ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రస్తుతం పంటలపై తెగుళ్ల ప్రభావం?
జిల్లాలో ఎక్కడా తెగుళ్ల ప్రభావం కన్పించడం లేదు. గత నెలలో వరిపై ఆకుముడత తెగులు కన్పించినా ప్రస్తుతం తొలగిపోయింది. ఎండల తీవ్రతకు తెగుళ్ల తీవ్రత తగ్గింది.
రబీలో ఏయే పంటలు వేసుకోవాలి?
ప్రస్తుతం ఖరీఫ్‌లో వర్షాభావం, జలాశయాల్లో నీటి నిల్వలు పెరగకపోవడం, ఎగువ నుంచి నీరు రాకపోవడం వల్ల రబీలో తప్పని సరిగా ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందే.జొన్న, మొక్కజొన్న సాగు చేసినా రాబోయే రెండు నెలల్లో వర్షాలు రాకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందువల్ల మినుము, పెసర సాగుకు రైతులు మొగ్గు చూపాలి. వర్షాలు కురిసినా జలాశయాల్లో నీరు లేకపోవడం వల్ల సాగు నీరు వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి.