
ప్రజాశక్తి - కాకుమాను : నెర్రెలిచ్చిన వరిపొలాలను తడపడం కోసం ఆయిల్ ఇజన్లు ఘోష పెడుతున్నాయి.. అప్పులు చేసి పెట్టుబడులు సమకూర్చుకున్న రైతులు, కౌలురైతులు తాము కష్టించి సాగు చేసిన పంటను ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందోనని కాల్వల వద్ద పడిగాపులు గాస్తున్నారు.. ప్రస్తుతం వ్యవసాయంలో నెలకొన్న నీటి కరువు తీవ్రతకు మండలంలోని రేటూరులోని ఒ పంట కాల్వ వద్ద ఆదివారం కనిపించిన ఇంజన్లు అద్దం పడుతున్నాయి. అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితులు ఉన్నాయి.
మండలంలోని అప్పాపురం మీదుగా ప్రవహించే కొమ్మమూరు కెనాల్ ద్వారా మండలంలోని పలు గ్రామాలకు సాగు, తాగు నీరు అందుతుంది. కొమ్మమూరు కెనాల్ నుండి పంట కాల్వలకు, చెరువులకు నీరు పెట్టుకుంటూ ఉంటారు. కొమ్మమూరు కాల్వకు నీరు విడుదల చేయడంతో వాటిని పొలాలకు పెట్టి పైరును బతికించు కోవ డానికి రైతులు నానా తంటాలు పడుతు న్నారు. రేటూరులో మొత్తం సాగు భూమి 3100 ఎకరాలు కాగా ఇందులో రెండు వేల ఎకరాల్లోనే వరి సాగు చేశారు. మిగతా పొలాలు సాగునీరు రాని కారణంగా బీడుగానే ఉన్నాయి. కొమ్మమూరు కెనాల్‌కు సమీపంలో సాగైన పొలాలు కూడా నీరందక నేల నెర్రెలిచ్చింది. తాజాగా కెనాల్‌కు నీరు విడుదల చేయడంతో వాటిని పొలాలకు పెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.
కెనాల్ నుండి నీరు పంట కాల్వల వరకూ రాకపోవడంతో రైతులు ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. కొమ్మమూరు కెనాల్‌లో ఇంజన్లు పెట్టి వాటిని పంట కాల్వలకు మళ్లించుకుంటున్నారు. పంట కాల్వల నుండి మళ్లీ నీటిని ఇంజన్ల ద్వారానే పొలాలకు పెట్టుకుంటున్నారు. ఇంజన్లు లేనిదే పొలానికి నీరందని నేపథ్యంలో సాగుదార్లంతా ఇంజన్లు కొనుక్కుంటున్నారు. ఒక్కో ఇంజన్ రూ.33-35 వేలు అవుతోందని, తాము సొంతంగానే కొనుక్కుంటున్నామని, గ్రామంలో 70కు పైగా ఇంజన్లు ఉన్నాయని, అయినా తమకు ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం, రాయితీలు వంటివి ఏమీ లేవని రైతులంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ గ్రామంలో సాగవుతున్న పొలంలో 90 శాతం మంది కౌలురైతులే సాగు చేస్తున్నారు. వీరు ఎకరాలకు డబ్బు కౌలు అయితే రూ.20 వేలు, వడ్డు కౌలు అయితే 10 బస్తాలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఎకరాలకు రూ.10-15 వేల పెట్టుబడి పెట్టారు. దీనికి అదనంగా ఇంజన్లకూ పెట్టుబడి పెట్టాల్సి రావడం, దానికోసమూ అప్పులు చేయాల్సి రావడంతో తీవ్ర ఆర్థిక భారాన్ని కౌల్దార్లు మోస్తున్నారు. ఇంజన్ లేని వారు డబ్బులు చెల్లించి కాల్వ దగ్గర ఒక ఇంజన్, పొలం దగ్గర ఒక ఇంజన్ పెట్టుకుంటేనే పొలానికి కాస్తయినా నీరందించ గలుగుతున్నారు.
ప్రస్తుతం గ్రామంలోని బుడకాల్వ వద్ద ఒకేసారి 15 ఇంజన్లను పెట్టి నీటిని పొలానికి మళ్లిస్తున్నారు. ఈ ప్రాంతంలో 1500 ఎకరాల పొలం ఉండగా ఈ ప్రాంతానికే కొమ్మమూరు కెనాల్ నీరందుతోంది. మిగతా ప్రాంతాల్లో సాగైన వారి ఇప్పటికే ఎండిపోయింది. అల్లీకాల్వ వద్ద ఇంజన్లు పెట్టడానికి కూడా సరిపడా స్థలం లేక రైతులు ఒక్కసారే కాకుండా దశల వారీగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇన్ని వ్యయప్రయాసలకోర్చి నీరు పెట్టినా ఇవి పొలంలో వారానికి మించి ఉండవని, వర్షం ద్వారా లేదా కాల్వల నుండి నేరుగా వస్తే రెండు మూడు వారాలు నిలుస్తాయని రైతులు చెబుతున్నారు.
ఈ కష్టమంతా నష్టాన్ని తగ్గించుకోవడానికే
రేటూరు వెంకటేశ్వరరావు, కౌలురైతు, రేటూరు.
25 ఎకరాల కౌలుకు వేశాను. ఇందుకుగాను రూ.4 లక్షల వరకూ పెట్టుబడి ఖర్చయింది. ఇందులో రూ.లక్షన్నర వరకూ ఇంట్లో బంగారం తనఖా పెట్టి, ఇంకో రూ.లక్ష గతేడాది పంటను అమ్మి సమకూర్చుకోగా మరో రూ.లక్షన్నర అప్పులు చేశాం. ఇన్ని అప్పులు చేసి వేసిన పైరుకు నీరు పెట్టడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అయినా పంటమొత్తం చేతికొస్తుందనే నమ్మకం లేదు. మామూలుగా ఎకరాకు 35-40 బస్తాల పంట పండాలి. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల 25 బస్తాలకు మించి పండేలా లేదు. మొదటి పంటలో నష్టాలు తప్పకున్నా దాన్ని తగ్గించుకోవడానికే కష్టపడుతున్నాం. రెండో పంటమీదే మా ఆశంతా.