Sep 14,2023 22:30

నరుకుళ్లపాడు - అమరావతి మధ్యలో దెబ్బతిన్న పత్తిపైరును పరిశీలిస్తున్న సూరిబాబు

ప్రజాశక్తి - అమరావతి : ఇటీవల వర్షాలకు వాగు ఉధృతి పెరిగి పలు గ్రామాల్లో పైర్లు ముంపుబారిన పడ్డాయి. మండలంలోని నరుకుళ్లపాడు, ఎండ్రాయి, పెద్దమద్దూరు తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పైర్లు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆయా పొలాలను సిపిఎం మండల కార్యదర్శి బి.సూరిబాబు గురువారం పరిశీలించారు. వాగు ఉధృతి కారణంగా నీరు పొలాల్లో చేరి మూడ్రోజులపాటు నిలిచాయని, దీంతో రైతులు సాగు చేసిన పత్తి, మిర్చి, ఇతర పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని సూరిబాబు చెప్పారు. రైతులు, కౌలురైతులు తీవ్రంగా నష్టపోయినా అధికారులు స్పందించలేదని, ఇప్పటికీ పొలాలను పరిశీలించడం గాని, నష్ట అంచనాలు రూపొందించడం గాని చేయలేదని విమర్శించారు. పంటల సాగుకోసం రైతులు ఇప్పటికే రూ.20 వేల వరకూ పెట్టుబడి పెట్టారని, కౌలురైతులు మరో రూ.20-30 వేలు కౌలు చెల్లించారని, పత్తి కాపుదశలో, మిర్చి, ఇతర పైర్లు 40 రోజుల దశలో ఉండగా వర్షాలతో వాగు పొంగి పొలాలను ముంచెత్తిందని తెలిపారు. గతంలోనూ పొలాలు ముంపుబారిన పడినా బాధిత రైతులకు పరిహారం అరకొరగానే ఇచ్చారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కలుగజేసుకోవాలన్నారు.