Oct 18,2023 00:08

ప్రజాశక్తి - చిలకలూరిపేట : వర్షాల్లేక, కాల్వల్లో నీరు పారక, బోర్లు పనిచేయక పైర్లన్నీ కళ్లముందే ఎండిపోతున్నాయని, అయినా రైతుల గోడును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒకవైపు కృష్ణా పరివాహక ప్రాంతంలో చుక్కనీరు లేదని, మరోవైపు ఎడాపెడా విద్యుత్‌ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్న పైర్లను చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం కరువు మండలాలనైనా ప్రకటించకుండా రైతుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. కరెంటు కోతలకు తాళలేక విద్యుత్‌ ఉపకేంద్రాలను ముట్టడిస్తున్న రైతులకు సమధానం చెప్పలేక పోతున్నారని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో మరీ దయనీమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రభుత్వ ప్రణాళిక లోపం కారణంగా సరిపడా సాగునీరు లేక కృష్ణా డెల్టాలో పరిస్థితి మరింద ఆందోళనకరంగా ఉంద న్నారు. ఆరుతడి పంటలకైనా నీరు విడుదల చేస్తారో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని పుల్లారావు డిమాండ్‌ చేశారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : రైతులు సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతుండే వారి గోడు పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు ఎలా పెట్టాలా? అని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు సాగునీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, కరువు మండలాలను ప్రకటించాల్సిన ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదని అన్నారు. సాగునీటి విషయంలో రాష్ట్ర రైతులను తెలంగాణకు ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని విమర్శించారు. పార్టీ మారిన నాయకులపై మంత్రి అంబటి రాంబాబు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వీటికి నిరసనగా త్వరలో ధర్నా చేస్తానని చెప్పారు.