Sep 25,2023 23:26

ముప్పాళ్లలో వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ముప్పాళ్ల : వర్షాభావం కారణంగా మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఆరు తడి పంటల సాగుకైనా ప్రభుత్వం నీటి ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ కోరారు. ఈ మేరకు తహశీల్దార్‌ భవానీ శంకర్‌కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సాగర్‌ ఆయకట్టులో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి రైతులు తీవ్ర అందోళనలో ఉన్నారన్నారు. ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని అన్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని, వారిని ఆదుకోవాలని విన్నవించారు. పైర్లు వేయని పొలాలకు వాతావరణ బీమాను వర్తింపజేయాలని, రబీలో సాగుచేసే ఫైర్లకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు కె.సాంబశివరావు, జి.జాలయ్య, కె.నాగేశ్వరరావు, టి.అమరలింగేశ్వరరావు, నరసింహారావు, కె.ప్రభాకర్‌, పి.సైదాఖాన్‌, టి.బ్రహ్మయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - నకరికల్లు : సాగు భూముల్లో పంటలేయక కూలీలకు పనులు తగ్గాయని, ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులు కల్పించాలని సిపిఎం, రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపి తహశీల్దార్‌ నగేష్‌కు వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి జి.పిచ్చారావు మాట్లాడుతూ ప్రభుత్వం సాగర్‌ నీటి జలాలు విడుదల చేయకపోవడం, వర్షాలు పడకపోవడం వల్ల మండలంలో సుమారు 70 శాతం భూములు బీళ్లుగా ఉన్నాయన్నారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. కౌలురైతులు, రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. రబీ సీజన్లో సాగు కోసం నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఇ.అప్పిరెడ్డి, నాయకులు ఇ.లక్ష్మారెడ్డి, జి.వెంకటరమణ, ఎస్‌.రామాంజనేయ నాయక్‌, జి.ఏడుకొండలు, షేక్‌ లాల్‌, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
ప్రజాశక్తి - రొంపిచర్ల : మండలంలో ఖరీఫ్‌లో 20 వేల ఎకరాలకు సాగవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ వెయ్యి ఎకరాల్లోనే పైర్లు వేశారని, వర్షాల్లేక, ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్న తరుణంలో వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారిందని కౌలురైతు సంఘం నాయకులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముందుగానే కౌలు చెల్లించిన కౌల్దార్లు ఇప్పుడు ఏ పంటలేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, మండలంలో ప్రధాన సాగు అయిన వరికి సాగర్‌ జలాలు ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించిన దృష్ట్యా రబీ పంటలైన మిర్చి, మొక్కజొన్న, అపరాల సాగుకు నీటి ప్రణాళిక ప్రకటించాలని కోరారు. కూలీలకు పనుల్లేని నేపథ్యంలో వారికి కరువుభత్యం ఇవ్వాలని, రైతులు, కౌలురైతుల రుణాలను మాఫీ చేయాలని కోరారు. సాగర్‌ కాల్వలకు నీరు విడుదల చేసినా మేజర్‌, మైనర్‌ కాల్వలన్నీ గడ్డితో ఉన్న దృష్ట్యా చివరి పొలాలకు నీరందే పరిస్థితి లేదని, కాల్వలలకు వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు అంజిరెడ్డి, బి.నాగేశ్వరరావు, ఎస్‌.వెంకటేశ్వరరాజు ఉన్నారు.