పైపులైన్ లీకేజీతో నీరు కలుషితం
- పట్టించుకోని సంబంధిత అధికారులు
ప్రజాశక్తి - పగిడ్యాల
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తాగునీటి వసతి కల్పించేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులు, జిఎల్‌ఆర్‌ఎస్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి బోరుబావులు వేసి పైపులు ద్వారా నీటిని ట్యాంకులకు సరఫరా చేస్తుంది. అయితే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల పైప్‌లైన్ లీకేజీలై నీరు వృధాగా పోవడమే కాక కలుషితమవుతుంది. అందుకు నిదర్శనం మండల కేంద్రం పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన గేటు సమీపాన పైప్‌లైన్ లీకై నీరు వృధాగా పోవడమే.
పగిడ్యాల గ్రామానికి ఆంజనేయ నగర్ గ్రామంలోని బోరుబావి ద్వారా విద్యుత్ మోటార్ అమర్చి పైప్‌లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకు నీరు సరఫరా చేస్తారు. ఆ నీటిని గ్రామంలోని కుళాయిలకు సరఫరా చేస్తారు. పైపులైన్ లీక్ కావడంతో నీరు కలుషితమవుతుంది. ఆ నీటినే ట్యాంకులకు, కొళాయిలకు సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నీరు కలుషితమై దాదాపు 120 మందికి పైగా అతిసారా వ్యాధి సోకి ఆసుపత్రి పాలయ్యారు. వైద్య సిబ్బంది 24 గంటలు కష్టపడి అతిసారా వ్యాధిని అదుపు చేశారు. నీటి కలుషితం వల్లే అతిసారా సోకిందని వైద్యులు నిర్ధారించారు. కలుషితమైన నీరు తాగి అతిసార వ్యాధి సోకిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కళ్లారా చూసిన అధికారులు తాగునీటి పైపులు లీకై నీరు వృధాగా పోవడమే కాక కలుషితమవుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. పాఠశాల సమీపాన పైపులైన్ లీకై నీరు వృధా పోతుందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని పాఠశాల సిబ్బంది పేర్కొంటున్నారు. అతిసార వ్యాధి అదుపులోకి తెచ్చి నెల కూడా గడవకముందే మళ్లీ నీరు కలుషితమయితే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీకైన పైపులైను మరమ్మతులు చేసి నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
జడ్పి పాఠశాల ప్రధాన గేటు వద్ద లీకైన పైపులైన్ దృశ్యం