Nov 16,2023 21:23

క్రీడాకారులను అభినందిస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   నగరంలోని పద్మావతి నగర్‌ ప్రాంతంలోని వసంత విహార్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పైపులైన్‌ పనులకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి గురువారం శంకుస్థాపన చేశారు. రూ.6.86 లక్షల రూపాయల వ్యయంతో పైపులైన్‌ పనులను నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ విభాగం చేపట్టింది. పనులు పూర్తయిన తర్వాత ఆ ప్రాంత వాసులందరికీ తాగునీటి సదుపాయం కలగనుంది. ఈ సందర్భంగా 31, 32 డివిజన్ల కార్పొరేటర్లు ఎన్ని లక్ష్మణరావు, పతివాడ గణపతి రావు మాట్లాడుతూ వసంత విహార్‌ వాసులకు ఎన్నో ఏళ్ల నాటి కల సాకారం అయిందని అన్నారు. ఇప్పటికే 31వ డివిజన్లో 4.50 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మేయరు విజయలక్ష్మి, జోనల్‌ ఇన్చార్జిలు అప్పారావు, మారం బాల బ్రహ్మారెడ్డి, వసంత విహార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ పాల్గొన్నారు.
బాక్సింగ్‌ క్రీడా కారులకు కోలగట్ల అభినందన
క్రీడా స్ఫూర్తితో నగరానికి మరింత ఖ్యాతిని తీసుకురావాలని బాక్సింగ్‌ క్రీడాకారులను ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. రాష్ట్ర స్థాయి సీనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్షిప్‌ పోటీలలో నగరానికి చెందిన క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీలలో రెండు రజిత, మూడు కాంస్య పథకాలను సాధించారు. క్రీడాకారులను అభినందిస్తూ పథకాలను, ప్రశంస పత్రాలను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో అందజేశారు. కార్యక్రమంలో బాక్సింగ్‌ కోచ్‌లు సీతారామాంజ నేయులు, రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.