
ప్రజాశక్తి - ఆచంట
ఆచంట ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘంలో ఖాతాదారులు, సంఘం సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం వల్ల సహకార సంఘం మనుగడ ప్రశ్నార్ధంగా మారిందని సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం బుధవారం సాధారణ మహాసభ ఛైర్ పర్సన్ ఎస్.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ మహాజన సభ ప్రారంభం ముందుగానే ఎజెండాలో పొందుపర్చిన 10వ అంశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వరల్డ్ లార్జెస్ట్ గ్రైన్ స్టోరేజ్ ఇన్ఫ్ర్‌స్ట్రక్చర్ ప్రాజెక్టుపై సభ్యులంతా అధికారులపై మూకుమ్మడిగా ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఆచంట సొసైటీకి ప్రాజెక్టు మంజూరైంది. దీంతో ఎటువంటి ఉపయోగం లేదంటూ సొసైటీ సభ్యులు, రైతులు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్టుకు సంబంధించి పనులు నిలుపుదల చేయాలంటూ కోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన సాధారణ మహాజన సభలో సంఘం సభ్యులు సహకార పరపతి సంఘానికి ఒక రైస్ మిల్లు ముద్దు, రెండోది వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభను సుమారు అరగంట వాయిదా వేసి తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు వల్ల లాభాల్లో ఉన్న సొసైటీ కాస్త దివాలా తీస్తే డిపాజిట్ దారులకు భంగపాటు తప్పదని సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నిర్మించే ఆధునిక రైస్ మిల్లు, గోదాముల వల్ల ఇక్కడ ప్రజలకు ఫలితం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఉన్న ఒక రైస్ మిల్లు నష్టాలు బాటలో నడుస్తోందని, దీనికితోడు కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు తీసుకురావడంతోపాటు అప్పటి సంఘం కమిటీ సభ్యులు చేత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బలవంతంగా సంతకాలు చేయించుకోవడం, అనంతరం జరిగిన పరిణామాల్లో సంఘం సభ్యులను తొలగించి స్పెషల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. వీరిలో కమిటీ సభ్యులుగా ఎస్.శ్రీనివాసరావు, ఛైర్ పర్సన్‌గా (అసిస్టెంట్ రిజిస్టర్) కె.జోసెఫ్, పాల్ పర్సన్స్ (అసిస్టెంట్ రిజిస్టర్) ఇ.నాగేశ్వరరావు పర్సన్ ( డిసిసిబి భీమవరం చైర్ మేనేజర్) కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ పైలెట్ ప్రాజెక్టును సంఘ సభ్యులందరూ ఏకగ్రీవంగా తిరస్కరించిన ప్రభుత్వ మాత్రం పట్టుదలతో ముందుకు వెళ్లడంతో అఖిలపక్ష నాయకులు హైకోర్టును ఆశ్రయించి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులను తాత్కాలిక నిలుపుదల చేయాలని తీర్మానించినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఆచంట సహకార సంఘానికి స్థలం అందుబాటులో ఉండడంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో స్థలం సేకరణ సమస్య లేకపోవడంతో సొసైటీలో డిపాజిట్ పెద్ద మొత్తంలో ఉండటం ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఏర్పాటు చేయాలన్న తలంపులో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సొసైటీ త్రిసభ్య కమిటీని రద్దుచేసి ముగ్గురు ప్రత్యేక అధికారులతో ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం చొరవచూపుతోంది. ఇప్పటివరకూ ఆ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు పెట్టినా ప్రభుత్వమే భరించాలని సొసైటీకి ఏమాత్రమూ సంబంధం లేదని సంఘ సభ్యులు ముక్తకంఠంతో తీర్మానించారు. అనంతరం ఎజెండాలో ఉన్న పలు అంశాలను సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్లు కెవి.రమణమూర్తి, జె.వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి వేండ్ర విష్ణుమూర్తి పాల్గొన్నారు.