Oct 07,2023 20:57

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పైడితల్లమ్మ జాతర సమయానికల్లా నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. శనివారం ట్యాంక్‌బండ్‌ రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆరు లైన్ల విస్తీర్ణంతో మయూరి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పైడితల్లమ్మ పండగ నాటికి ఎస్‌బిటి రోడ్డు, అయ్యన్నపేట రోడ్డు, మయూరి రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే అంబటి సత్రం నుంచి కొత్తపేట రహదారికి టెండర్లు ప్రక్రియను కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. మయూరి నుండి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు విస్తరిస్తున్న రహదారి పనుల మధ్యలో డివైడర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, వైసిపి నాయకులు జివి రంగారావు, బి.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
పాలనపై ఇంటింటికీ వివరించండి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన అన్ని వర్గాలూ మెచ్చేలా సాగుతోందని ఇంటింటికీ వివరించాలని కార్యకర్తలకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. కంటోన్మెంట్‌ వద్ద వైసిపి కార్యాలయంలో క్లస్టర్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 11 నుంచి నెల రోజులపాటు చేపట్టనున్న 'ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి' కార్యక్రమంలో భాగగా ఇంటింటికీ వెళ్లి గత టిడిపి ప్రభుత్వానికి, ప్రస్తుత జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలును ముఖ్యమంత్రి జగన్‌ ఏనాడూ ఆపలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో జోనల్‌ ఇన్చార్జ్‌ డాక్టర్‌ వీఎస్‌ ప్రసాద్‌, పలువురు కార్పొరేటర్లు మాట్లాడారు. క్లస్టర్‌ అధ్యక్షులు, జోనల్‌ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.