Sep 04,2023 00:31

మాట్లాడుతున్న అనిత

ప్రజాశక్తి -నక్కపల్లి:టిడిపి శ్రేణులు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. నక్కపల్లిలో సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం పార్టీ శ్రేణులతో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నాయకుడన్నారు. పటిష్టమైన వ్యవస్థ టిడిపికి ఉందన్నారు. పార్టీకి కొండంత బలం పార్టీ కార్యకర్తలేనని తెలిపారు. పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎత్తివేస్తారని అసత్య ప్రచారం చేశారని, మహానాడులో చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ పథకం వివరించినప్పుడు అసత్య ప్రచారం చేసిన నోర్లు మూతపడ్డాయన్నారు. వైసిపి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. వైసిపి పాలనలో నిత్యవసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌ చార్జీల ధరలు విపరీతంగా పెరిగా యన్నారు. భవిష్యత్తు గ్యారెంటీ ,మహాశక్తి పథకాలను ఇప్పటికే గ్రామస్థాయిలో ప్రచారం చేయడం జరిగిందని, మరింతగా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తాను పాయకరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ మాజీ సభ్యులు కొప్పిశెట్టి కొండబాబు మాట్లాడుతూ, గ్రామాల్లో చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, గ్రామస్థాయి, మండల స్థాయి నాయకత్వంతో చర్చించి అందరి ఆమోదంతో పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌ ,పార్టీ నాయకులు కురందాసు నూకరాజు, దేవర సత్యనారాయణ, వైబోయిన రమణ, గింజాల లక్ష్మణరావు, కొప్పిశెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.గ