ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందచేయాలని కోరుతూ శుక్రవారం స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కాలేజిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. విద్యార్థినులు పెద్ద సంఖ్యలో వచ్చి సంతకాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే కనీసం పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించలేకపోతుందని విమర్శించారు. ఈ ఏడాది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేమని, మీరే కొనుక్కొండని ఇంటర్ బోర్డు ప్రకటించటం వల్ల విద్యార్థులపై వేలాది రూపాయాల భారం పడుతోందని చెప్పారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయటానికే ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారని, విద్య బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటుందని అన్నారు. టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయకుండా, మౌలిక సదుపాయాలు సమకూర్చకుండా రాష్ట్రంలో మంచి చదువులు అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రూపస్, నగర అధ్యక్ష కార్యదర్శులు పి.పద్మ, ఎస్.కె.సమీర్, నాయకులు స్రవంతి, గీత, వాణి, ఫాతిమా పాల్గొన్నారు.










