ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక అమరావతి రోడ్డులోని ప్రభుత్వ పాఠ్యపుస్తక గోడౌన్ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మండలాలకు ఆర్టీసి కార్గో బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాల పంపిణీని ఆర్‌జెడి వి.ఎస్.సుబ్బారావు, డిఇఒ పి.శైలజ శనివారం ప్రారంభించారు. ఆర్‌జెడి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠశాలలు తెరవక ముందే మండల స్టాక్ పాయింట్లకు పుస్తకాలు చేరవేస్తున్నట్లు చెప్పారు. డిఇఒ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలతోపాటు, వర్క్‌బుక్స్, సెమిస్టర్ పుస్తకాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యాసంవత్సరం ముగిసే నాటికే మరుసటి విద్యా సంవత్సరానికి అవసరమైన పుస్తకాలను ముద్రించి, జిల్లాకు పంపినట్లు చెప్పారు. జిల్లా పాఠ్యపుస్తక మేనేజర్ వి.వజ్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పాఠశాలలకు 39 లక్షల పుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టినట్లు చెప్పారు. ఇందులో మొదటి విడతగా 11.52 లక్షల పుస్తకాలకుగాను 10.14 లక్షల పుస్తకాలు వచ్చాయన్నారు. వాటిని ప్రతిరోజూ ఆర్టీసి కార్గో ద్వారా మండలాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఏటిఎం సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.










