ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రాథమిక విద్యకు సంవత్సరానికి రూ.45 వేల నుంచి రూ.80 వేలు వరకు ఫీజులు చెల్లిస్తున్నాం. ఇవే కాకుండా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాల పేరుతో మరో రూ.10 వేలు అదనంగా లాగుతున్నారు. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలకు కలిపి రూ.6 వేలు నుంచి రూ.9,500 వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని, పుస్తకాలకు డబ్బులు తగ్గించాలని కోరినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాయని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలను విక్రయించాలని నోట్ పుస్తకాలు ,ఇతర వస్తువులు అమ్మరాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా యాజమాన్యాలు పెడ చెవినే పెడుతున్నాయి.
ఇష్టారాజ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలు
విద్యాహక్కు చట్టాన్ని పక్కన పెట్టిన జిల్లాలో పలు ప్రయివేటు విద్యా సంస్థలు నిబంధనలను విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులు కొల్లగొడుతున్నాయి. అదే సందర్భంలో పుస్తకాలను మా వద్దే కొనుగోలు చేయాలని తేల్చి భారీగా ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు జరపడమే కాకు నోట్ బుక్స్, షూస్, టై, యూనిఫామ్ ఇలా విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అక్కడే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నాయి. బయట కొనుగోలు చేసేవి ఇక్కడ చెల్లుబాటు కావని హెచ్చరిస్తున్నారు. అవసరం లేనివి కూడా కొనుగోలు చేయిస్తూ అందినకాడికి సొమ్ములు దండుకుంటున్నారని అనేకమంది తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి ఉంది
ప్రభుత్వ పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వారికి ఉచితంగా, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలకు తరగతుల వారీగా ప్రభుత్వం పుస్తకాల ధరలను నిర్ణయించింది. 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంకు రూ.326 నుంచి 657 వరకూ, ఇంగ్లీషు మీడియంకు రూ.280 నుంచి 674 వరకూ మాత్రమే పాఠ్యపుస్తకాలను విక్రయించాల్సి ఉంది. నిర్ణయించిన ధరలకు మించి ఎక్కవ రేట్లకు అమ్మితే ఆయా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు, డొనేషన్ల పేరుతో భారీగా సొమ్ములు దండుతున్నారు. బస్సు రవాణా ఛార్జీలను విడిగా వసూలు చేస్తున్నారు. అవే కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు 10 నుంచి 20 శాతం అదనంగా పుస్తకాల కోసం వసూలు చేస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు రూ.4,500 నుంచి రూ.8 వేలు పైనే బాదేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.










