Sep 14,2023 01:07

పాఠశాలకు నడిచి వెళుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రానికి కూతవేటు దూరంలో కర్రిముఖిపుట్టు గ్రామ పంచాయతీ పాఠశాలలకు అదే గ్రామ సచివాలయంకు చెందిన విద్యార్థులు వెళ్లి చదువుకునేందుకు అవస్థలు పడుతున్నారు. గేదాలబందా, బరెంగుల, దాసరిపుట్‌ గ్రామ విద్యార్థులు సుమారు 2 కిలోమీటర దూరంలో ఉన్న కరీముకిపుట్‌ ఎంపీపీ స్కూల్‌కు దాదాపుగా 40మంది విద్యార్థులు కాలి నడకన వెళ్లి చదుకొంటున్నారు. ఈ మూడు గ్రామాలలో ఎస్టీ పివిటి తెగలకు చెందిన కోదు, పొజ్జా తెగల విద్యార్థులు ఉన్నారు. మూడు గ్రామాల నడుమ ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడి పిల్లలకు విద్యాభ్యాసాన్ని అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు జి జీనభందు, జి.నారాయణ డిమాండ్‌ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,నాలుగు రోజులు ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులు విద్యాభ్యాసానికై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కాలినడకన వెళ్తున్నారన్నారు. మార్గమధ్యంలో కల్వర్టు పై నుంచి వరద నీరు పోటెత్తడంతో విద్యార్థులు వాగు దాటలేక అక్కడే స్తంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటీడీఏ అభిషేక్‌ఏ స్పందించి మూడు గ్రామాలకు ఒక పాఠశాల నిర్మించి విద్యార్థులకు మెరుగైన విద్య అందజేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మండల ఎంఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.