Feb 20,2023 23:49

పాఠశాల వద్ద ఆందోళన చేపడుతున్న గిరిజన సంఘం నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ కుమిడిపుట్టు గ్రామ ఎంపీపీ ప్రాథమిక పాఠశాలతో పాటు 11 ప్రాథమిక పాఠశాలలను మూసివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని గిరిజన సంఘం నేతలు తెలిపారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను ఆధ్వర్యాన గుమ్మిడిపుట్టు గ్రామ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో మండల వైస్‌ ఎంపీపీ 1 పాటుబోయి సత్యనారాయణ, లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌, విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల వద్ద ధర్నాను నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వైస్‌ ఎంపీపీ 1 సత్యనారాయణ, సర్పంచ్‌ త్రినాధ్‌లు మాట్లాడుతూ, విద్యార్థులు తక్కువగా ఉన్నారని మండలంలో 11 పాఠశాలలు ఎత్తేసే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులు ఎంతమంది ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతంలో విద్యాభ్యాసాన్ని అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో విద్య హక్కు చట్టం అమలు కాలేదన్నారు. గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయడం సరికాదన్నారు. మండలంలో డ్రాప్‌ ఔట్స్‌ విద్యార్థులు ఇప్పటికే అధిక సంఖ్యలో పెరుగుతుంతే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేయడం తగదన్నారు.గిరిజన ప్రాంతంలో ఉన్న పాఠశాలలను మూసివేయడమే కాకుండా, ఉపాధ్యాయ పోస్టులను కుదించి వేయడంతో
పేద నిరుపేద విద్యార్థులకు విద్య అందకుండా చేస్తుందన్నారు. పాఠశాలలు మూతపడితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, పాంగి భీమరాజులు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా డీఎస్సీల నియామకాలు చేపట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి సంవత్సరం డిఎస్సి విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జర్రెల ఉప్ప సర్పంచ్‌ గణపతి, నారాయణ, లైకొన్‌, డోంబ్రు, విద్యార్థుల తల్లి దండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.