ప్రజాశక్తి - పాచిపెంట : స్థానిక గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య పరిష్కరించాలని సిఐటియు, గిరిజన సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆ పాఠశాలకు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఎస్.ఎండయ్య వెళ్లి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ స్థానిక గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సుమారు 320 మందికి పైగా విద్యార్థులు ఉన్నారన్నారు. వీరికి ఆరు నెలలుగా తాగు, వాడుక నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వేసిన ఒకే ఒక్క బోరుకు మోటారు నీరందక, ట్యాంక్‌లో నీరు లేక గ్రౌండ్ వాటర్ లేక పిల్లలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిలు స్నానం చేయాలంటే బోరు నీరు తోడుకొని బాత్రూంకు వెళ్లాలని, భోజన అనంతరం ప్లేట్లు కడుక్కోవాలి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క బోరింగ్ ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఐటిడిఎ పిఒ స్పందించి తక్షణమే వసతిగృహంలో తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










