Jun 12,2023 18:07

అపరిశుభ్రంగా ఉన్న నేమకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోంది. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. పాఠశాలలు తెరుస్తున్నారు, పరిశుభ్రంగా ఉంచుకుందామని మండలంలోని ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏ అధికారికీ ఆలోచన రాకపోవడం శోచనీయమని ప్రజలు విమర్శిస్తున్నారు. నేమకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గాలివానకు కూలిన చెట్లను తీసే వారే కరువయ్యారు. బెల్డోన గ్రామంలో నాడు-నేడు పథకం కింద చేపట్టిన పనుల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, విద్యార్థులు కూర్చోవడానికి కూడా బండ పరుపు వేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్నా ఏ పాఠశాలలో కూడా నాడు-నేడు పనులు వంద శాతం పూర్తి కాలేదని పేర్కొంటున్నారు. రామదుర్గంలో మరమ్మతు పనులు పూర్తి కాలేదని, అన్ని అరకొరగా ఉన్నాయని తెలిపారు. ప్రయివేట్‌ పాఠశాలలో ఏ విధంగా వసతులు సమకూరుస్తున్నారో ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని వసతులూ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రూ.కోట్లు మంజూరు చేస్తున్నప్పటికీ కిందిస్థాయిలో ఆచరణ కనబడడం లేదని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలలపై ప్రాధాన్యత పెంచి అన్ని వసతులూ సమకూర్చేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.