
ప్రజాశక్తి- సీతమ్మధార : పేదలు అభివృద్ధి చెందాలంటే విద్యే మూలమని, ప్రపంచ బ్యాంకు నిబంధనలకు తలొగ్గి పాఠశాలలను మూయొద్దని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంక్షేమ సంఘం సౌజన్యంతో ఆదివారం పౌర గ్రంథాలయంలో విద్యారంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన, రాష్ట్ర కన్వీనర్ కట్టా మల్లేశ్వరావు పర్యవేక్షణలో సాగిన సదస్సులో విద్యను ధ్వంసం చేస్తున్న 117 జిఒను రద్దు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని తీర్మానించి ఏకగ్రీవంగా ఆమోదించారు.
అనంతరం ముఖ్యఅతిథి, దళితసేన అధ్యక్షుడు జెబి.రాజు మాట్లాడుతూ, పాఠశాలల విలీనం పేరుతో స్కూళ్లు మూసివేయడం విరమించుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఓట్ల కోసం విద్యా వ్యవస్థను పాడు చేయవద్దని కోరారు. గ్రామాల్లో విద్యార్థులు ఉన్నారని అయినా అక్కడి స్కూళ్లను ఎత్తివేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ విద్యకు పేదలు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు అందుబాటులో ఉన్న పాఠశాలలను ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జగన్ పాలనలో కోవిడ్ తర్వాత 13 లక్షల మంది విద్యార్థులు చదువు మానేశారని వివరించారు. ఏ జిల్లాలో ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయో వివరించారు. సానబోయిన రామారావు మాట్లాడుతూ, జాతీయ నూతన విద్యా విధానం పేరుతో 3,4,5, తరగతులను హైస్కూలులో విలీనం చేయడంవల్ల పాఠశాలల్లో గందరగోళం నెలకొందన్నారు. కట్టా మల్లేశ్వరావు మాట్లాడుతూ, 117 జిఒ ద్వారా విద్యార్థుల సంఖ్యను సాకుగా చూపి స్కూళ్లను తొలగించి ఉపాధ్యాయ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం వైస్ చైర్మన్ ఎల్‌వి.ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్య పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బి.జార్జిఆంటోని, మట్టపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.