Dec 13,2022 23:54

విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు

ప్రజాశక్తి-యంత్రాంగం
పలు పాఠశాలల్లో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం నిర్వహించారు.
పద్మనాభం : విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని పద్మనాభం ఎంపిపి కె.రాంబాబు అన్నారు మండలంలోని ఆర్‌వి.పురం జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మండల స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. 12 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కాలుష్యం, పరిశుభ్రమైన తాగునీరు, కరోనా వంటి వ్యాధుల నివారణకు తీసుకునే చర్యలపై ప్రదర్శనలో ఉంచారు. ఈ సైన్స్‌ ఫెయిర్‌లో అనంతవరం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రథమ స్థానం, పద్మనాభం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ 2వ స్థానాన్ని సాధించినట్లు ఎంపిపి తెలిపారు.
తగరపువలస : చిట్టివలస జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. జివిఎంసి ఒకటో జోన్‌ పరిధిలోని పలు జిల్లా పరిషత్‌, జివిఎంసి, ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొని 110 నమూనాలు ప్రదర్శించారు. 2023 జనవరిలో జరుగనున్న జిల్లా స్థాయి విద్యా వై జ్ఞానిక ప్రదర్శనకు 18 నమూనాలు ఎంపికైనట్లు చిట్టివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పొట్నూరు మురళీ మోహనరావు తెలిపారు. ముందుగా భీమిలి ప్రభుత్వ డైట్‌ ప్రిన్సిపల్‌ యు మాణిక్యంనాయుడు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. నలుగురు డైట్‌ అధ్యాపకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆనందపురం : గిడిజాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఎంఇఒ ఎస్‌ఎస్‌.పద్మావతి ఆధ్వర్యాన నిర్వహించారు. 15 జిల్లా పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు చెందిన 60 వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించారు. ఎంపిపి డాక్టర్‌ మజ్జి శారదా ప్రియాంక, వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీను ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందిస్తాయని తెలిపారు. న్యాయవాది చంద్రమౌళి, ఎంపిపి, వైస్‌ ఎంపిపి, సర్పంచ్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.సత్యనారాయణ పాత్ర, మండల యాక్టివ్‌ టీచర్‌ శరగడం సమత, అంజన కుమారి నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శినగం అప్పలరాజు, వైసిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి వెంకటరావు, బీసీ సెల్‌ నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఆరిలోవ : ఆరిలోవలోని తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మండలంలోని 13 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 67 నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రతి అంశం నుంచి మూడు నమూనాలను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించబోయే జిల్లా స్థాయి ప్రదర్శనలకు గోపాలపట్నం, తోటగరువు, మారికవలస, చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసినట్టు న్యాయ నిర్ణేతలు అల్లావుద్దీన్‌, బిఎన్‌.మూర్తి, పవన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్‌జిసి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఎస్‌.బాబూరావు, తోటగరువు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గాభవాని, పిఎంసి చైర్మన్‌ ధనలక్ష్మి పర్యవేక్షించారు.