పాఠశాలల్లో రద్దీ నివారణకు రోజు విడిచి రోజుగానీ, ఉదయం-మధ్యాహ్నం షిఫ్టులలోగానీ తరగతులు నిర్వహించాలని ... విద్య, మహిళా శిశు సంక్షేమం, క్రీడలు, యువత వ్యవహారాల స్థాయీ సంఘం సూచించింది. విద్యార్థులందరూ విధిగా మాస్కులు ధరించాలి. హాజరు సమయంలో ఉష్ణోగ్రతలు పరీక్షించాలి. తరచూ చేతులు కడుక్కునే విధంగా చూడాలి. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుందరికీ శానిటైజర్లు, మాస్కులు అందించాలి. కోవిడ్ ప్రోటోకాల్‌ను చిత్తశుద్ధితో అమలు చేయకుండా పాఠశాలలు తెరవడం సరయిన చర్య కాదు.
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. కరోనా రెండవ వేవ్ ఉధృతి తగ్గినా రోజుకు అటు ఇటుగా 1500 కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్న సందర్భంలో పాఠశాలలు తెరవడం....సన్నద్ధత లేకుండానే పూర్తిస్థాయిలో స్కూళ్లు పున:ప్రారంభించడం సమంజసం కాదు. ఎయిమ్స్ డైరెక్టర్, ఐసిఎంఆర్ మరియు విద్యారంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా పాఠశాలలు తెరిచే విషయమై పలు సూచనలు చేశాయి. దీర్ఘకాలంగా పాఠశాలలు భౌతికంగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో మానసిక ఒత్తిడులు ఏర్పడుతున్నాయని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు పున:ప్రారంభించారు. హర్యానా, నాగాలాండ్ జులై నెలలో పాఠశాలలు ప్రారంభిస్తే, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, లక్షద్వీప్ ఈ నెలలో ప్రారంభించాయి.
ప్రపంచవ్యాప్తంగా 2020 మార్చి నెల తర్వాత 80 కోట్ల మంది పిల్లలు విలువైన బడి సమయాన్ని కోల్పోయారు. మన దేశంలో 15 లక్షలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. 24.7 కోట్ల మంది పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇటువంటి పరిస్థితులలో పాఠశాలలు ప్రారంభించడం ఆశించదగ్గ పరిణామమే. కానీ దానికి తగిన సంసిద్ధత ఏది? పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులందరూ, మధ్యాహ్న భోజన సిబ్బంది, శానిటరీ వర్కర్లు అందరూ తప్పని సరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, మిగిలిన వారికి కూడా పూర్తిచేస్తామని ప్రభుత్వం కోర్టుకు సైతం తెలియజేసింది. నిజానికి వ్యాక్సినేషన్ పాఠశాల సిబ్బందికి మాత్రమే చేస్తే చాలా? విద్యార్థుల పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వారికి వ్యాక్సినేషన్ చేయకపోతే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా! దేశంలో ఇప్పటి వరకూ 50 కోట్ల మందికే వ్యాక్సినేషన్ పూర్తి చేశామంటున్న కేంద్ర రాష్ట్ర పభుత్వాలు అందరికీ టీకాలు వేయడానికి ఎంతకాలం పడుతుందో.
కరోనా వైరస్ కారణంగా పాఠశాలలను ఇప్పటికీ మూసివేయడం సమంజసం కాదని ఇంకా పాఠశాలలు తెరవకపోతే అది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. రాజ్యసభ సభ్యులు వినయ సహస్రబుద్దే అధ్యక్షతన గల విద్య, మహిళా శిశు సంక్షేమం, క్రీడలు, యువత వ్యవహారాల స్థాయీ సంఘం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పాఠశాలల్లో రద్దీ నివారణకు రోజు విడిచి రోజుగానీ, ఉదయం-మధ్యాహ్నం షిఫ్టులలోగానీ తరగతులు నిర్వహించాలని సూచించింది. విద్యార్థులందరూ విధిగా మాస్కులు ధరించాలి. హాజరు సమయంలో ఉష్ణోగ్రతలు పరీక్షించాలి. తరచూ చేతులు కడుక్కునే విధంగా చూడాలి. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుందరికీ శానిటైజర్లు, మాస్కులు అందించాలి. కోవిడ్ ప్రోటోకాల్‌ను చిత్తశుద్ధితో అమలు చేయకుండా పాఠశాలలు తెరవడం సరయిన చర్య కాదు. ఇప్పటికే కర్నాటకలో 272 విద్యార్థులు, తమిళనాడు కేరళలో మరి కొంతమంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారన్న వార్త తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కలవరానికి గురిచేస్తున్నది.
కరోనా మూడో వేవ్ వచ్చేస్తుందన్న...పరిస్థితులలో డిజిటల్ ప్లాట్‌ఫారం ద్వారా విద్యా బోధనకు కొంతమంది ఆసక్తి కనబరుస్తున్నారు. గణాంకాలు చూస్తే దేశంలో సగటున 37 శాతం స్కూళ్ళ లోనే పని చేసే కంప్యూటర్లు వున్నాయి. 22 శాతం బడుల్లోనే ఇంటర్నెట్ వసతి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ కలిపితేనే ఈ లెక్క. ప్రభుత్వ స్కూళ్ళ లెక్క తీస్తే 11 శాతం బడుల్లోనే ఇంటర్నెట్, 28.5 శాతం విద్యాలయాల్లోనే కంప్యూటర్లు ఉన్నాయనేది చేదు నిజం. దేశంలోని దాదాపు 15 లక్షలకు పైగా పాఠశాలలు, 8.5 కోట్ల మంది అధ్యాపకులు, 26 కోట్ల మందికి పైగా బడి పిల్లల నుంచి సేకరించిన డేటా ఇది. కరోనా వేళ పాఠశాల ముఖం చూసే పరిస్థితి లేని దేశంలోని 26 కోట్ల మందికి పైగా బడి పిల్లలకు ఈ అరకొర ఆన్‌లైన్ చదువులే శరణ్యమయ్యాయి. ఇప్పటికీ కరోనా మూడో వేవ్ ఎప్పుడు మీద పడుతుందో తెలియని భయం. అందుకే, ప్రత్యక్ష తరగతులకు తోడు డిజిటల్ తరగతుల మిశ్రమ అధ్యయన, అభ్యసన విధానం అమలు చేయాలి. కానీ, సాంకేతిక వసతులు, భారతీయ భాషల్లో నాణ్యమైన డిజిటల్ పాఠాలు కొరవడిన ఈ బడులలో పాఠాలు చెప్పేదెలా? కంప్యూటర్లు, ఇంటర్నెట్ కాదు కదా కనీసం మొబైల్ ఫోన్లు కూడా కరవైన బడుగు పిల్లల చదువులు సాగేదెలా? కరోనా దెబ్బతో దేశంలోని డిజిటల్ అంతరం బట్టబయలైంది. కేవలం మూడో వంతు మంది పిల్లలే ఆన్‌లైన్‌లో చదువు కొనసాగించారని గత అక్టోబర్‌లో విడుదలైన వార్షిక స్థాయి విద్యా నివేదిక వెల్లడించిన పరిస్థితి.
కానీ ఉపాధ్యాయులకు సైతం డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా బోధనను అందించే మౌలిక వసతులు, సాంకేతిక జ్ఞానాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొన్న దాఖలాలు ఎక్కడా కనపడవు. ఇప్పటి వరకూ జరిగిన అభ్యాస నష్టాన్ని పూరించడానికి తీసుకొన్న చర్యలు మనకు కనిపించవు.
ఏదేమైనా, ఒక రకంగా కరోనా మనకు ఓ మేలుకొలుపు. అనేక ప్రాథమిక రంగాల్లో మన వ్యవస్థాగత లోపాలను అది నగంగా నిలబెట్టింది. విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి అనేక కీలక అంశాల్లో...మన అవసరాలకూ, అందుబాటులో ఉన్న వసతులకూ అగాధమంత లోటు ఉందని తేల్చిచెప్పింది. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఇప్పుడిక ఈ ఉదాసీనతను వదిలించుకోవడమే మిగిలింది. కరోనా అనంతర కొత్త జీవితానికి అనుగుణంగా బోధనా విధానం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికనుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకొన్నపుడే కోవిడ్ భయాన్ని వీడి బోధానాభ్యసనం సమర్ధవంతంగా సాగుతుంది.
/ వ్యాసకర్త ఎ.పి.యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,
సెల్ : 9490762412 /
ఎస్.పి.మనోహర్ కుమార్











