
ప్రజాశక్తి-కె.కోటపాడు
చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో మండలంలోని అనేక పాఠశాలలో సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులంతా జాతీయ జెండాలతో జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. చంద్రయాన్-3 విజయవంతానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి స్థానిక అయ్యన్న విద్యాసంస్థల తరఫున అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఖాసీం మాట్లాడుతూ ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించడం మన అదృష్టమన్నారు. ఇస్రో విజయ స్ఫూర్తితో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మక్కువ పెంచుకొని రాణించాలని డాక్టర్ ఖాసిం కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ (విశాఖ)
41 రోజులు చంద్రయాన్-3 గగనతలంలో తిరిగి దిగ్విజయంగా చంద్రుడి పై ల్యాండ్ అవ్వడం యావత్ భారత దేశానికి గర్వకారణమని, ఇది భారతదేశంలోని 140 కోట్ల ప్రజల విజయంగా భావిస్తున్నామని డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా అధ్యక్షుడు యుఎస్‌ఎన్ రాజు, కార్యదర్శి సంతోష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు పేర్కొన్నారు. చంద్రయాన్-3 విజయవంతంపై హర్షం వ్యక్తంచేస్తూ గురువారం సాయంత్రం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాతో విజయోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రయోగంలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. విద్య, పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా మరిన్ని విజయాలను దేశం సొంతం చేసుకోవచ్చని తెలిపారు. శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించాలన్నారు.
నక్కపల్లి:చంద్రయాన్- 3 విజయవంతం పై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నక్కపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ప్రిన్సిపల్ కెఎస్‌ఆర్ కుమారి ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు చేసిన పలు ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారత శాస్త్రవేత్తల కృషి ప్రపంచ నలుమూలలకు తెలిసిందన్నారు.విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతబట్టి జయహౌ భారత్, జయహౌ చంద్రయాన్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, జారు, రజిత, సుప్రియ, కుమారి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
రాజయ్యపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నారాయణరావు ఆధ్వర్యంలో చంద్రయాన్ - 3 విజయవంతంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు జాతీయ జెండా చేతబట్టి చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సన్యాసిరావు, ఇంద్ర, లావణ్య, భారతి, సూర్య కుమారి, అర్జున అప్పారావు, చిరంజీవి, సునీల్, కిషోర్ పాల్గొన్నారు.
గొలుగొండ: చంద్రయాన్-3 విజయం కావడంతో
జోగుంపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో హెచ్‌ఎం సరోజిని, ఉపాధ్యాయులు హర్ష్యం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు భారతదేశం పేరు ప్రఖ్యాతలు చాటి చెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.