ప్రజాశక్తి - కలెక్టరేట్ : 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే చర్యను ప్రభుత్వం నిలుపుదల చేసే వరకు పోరాటం ఆగదని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఆదివారం ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1 నుంచి 8వ తరగతి వరకు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసిన మున్సిపల్ ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపునకు డిడిఒను నియమించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. విద్యార్థులకు తరగతి పాఠ్య పుస్తకాలను వెంటనే అందివ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలన్నారు. 117 జిఒను రద్దు చేయాలన్నారు. అలాగే ఆ జిఒపై వచ్చిన సవరణ జిఒ 128ని కూడా తక్షణం రద్దు చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేసే అంశంపై ఉపాధ్యాయులతోగానీ, తల్లిదండ్రులతోగానీ ప్రభుత్వం చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కొఠాన శ్రీనివాస్ ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తమలాల రామకృష్ణారావు పాల్గొన్నారు.










