Mar 05,2023 23:10

మాట్లాడుతున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలలు విలీనం చేసి గిరిజన విద్యార్ధులను విద్య నుండి దూరం చేసే ప్రయత్నం సరికాదని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నూతన విద్యా సంస్కరణపై సదస్సు తాంగుల చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు .వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నూతన విద్యా విధానం పేరుతో తక్కువ మంది ఉన్నారనే సాకుతో పాఠశాలలు మూసివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉద్యోగు లకు, అవుట్సోర్సింగ్‌ ఉద్యోగులకు, పింఛనుదారులకు ప్రభుత్వం చేసిన మేలేమిటని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, సకాలంలో డీఏలు చెల్లింపు హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటుకు తరలి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులపై జీవో నెం 1 తీసుకొచ్చి నిర్బంధ ప్రయోగాలకు పూనుకుని బ్రిటీష్‌ పాలనను తలపిస్తోందని విమర్శించారు. భవిష్యత్‌లో ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రతిఘటన తీవ్ర తరమవుతుందని స్పష్టం చేశారు. 11వ పీఆర్‌సీ సంబంధించిన ఎరియర్లు, 30 ఏళ్ల తరువాత చెల్లిస్తామని చెప్పడం.. మోసం కాదా అని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాట ఏమైందన్నారు.ఓపీఎస్‌ మాట మరిచిపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడుతున్న వారిని హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం అఖిలభారత నాయకులు తిరుపతిరావు, గిరిజన ఉద్యోగం సంఘం నాయకులు చిన్నంనాయుడు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి మహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కె.రఘునాథ్‌, ఎస్‌ రాంబాబు, ఎల్‌.నారాయణ, బాలకృష్ణ, టి.విజరు, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.