Feb 23,2023 00:13

ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ రవిబాబుకు వినతిపత్రం ఇస్తున్న బృంద ప్రతినిధులు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరణ చేసుకోవాలని కోరుతూ షెడ్యూల్డ్‌ ట్రైబల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ కుంభ రవి బాబుకు గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ ప్రతినిధి బృందం విశాఖలో బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో తక్కువ మంది విద్యార్థులు ఉన్న వాటిని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీన్ని అమలు చేస్తే అల్లూరి జిల్లాలో సుమారు 82 ప్రాథమిక పాఠశాలలు విలీనం జరుగుతుందని, ఫలితంగా సుమారు 900మంది గిరిజన విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం అవుతారని కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గిరిజన విద్య మరింత అస్థవ్యస్తమవుతుందన్నారు. గిరిజనుల్లో డ్రాప్‌ అవుట్‌ తో విద్యాభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. ఖాళీగా ఉన్న టీచర్స్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉపాధ్యాయ కొరత కారణంగా పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నారు. టీచర్స్‌ నిత్యం అందుబాటులో ఉండే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు 20 మందికిపైన ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత మూలంగానే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందని, దీనిని ప్రభుత్వం గుర్తించి టీచర్‌ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాల విలీన ప్రక్రియను ఉపసంహరణ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యమ సలహా దారులు కె.లోకనాదం, బి.గంగారావు, జగ్గునాయుడు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.