Mar 02,2023 00:01

మాట్లాడుతున్న డిఇఒ రామారావు

ప్రజాశక్తి-పర్చూరు : పాఠశాల సముదాయ చైర్మన్లుగా ఉన్న ప్రధానో పాధ్యాయులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను విధిగా సందర్శించాలని డిఇఒ రామారావు ఆదేశించారు. పర్చూరు మండల పరిషత్‌ కార్యాలయంలో నియోజవకర్గ పరిధిలోని ఎంఇఒలు, పాఠశాల సముదాయ చైర్మన్లు, ఎపిఎం, సిఆర్‌పిలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలకు చెందిన కార్యకలా పాలకు సంబంధించిన బాధ్యతలు మాత్రమే ఉపాధ్యా యులకు ప్రభుత్వం అప్పగిస్తుందని గుర్తించాలన్నారు. ఎంఇఒలు కొన్ని ఉన్నత పాఠశాలలను సందర్శించాలన్నారు. ఉప విద్యాశాఖాధికారులు 90 శాతం ఉన్నత పాఠశాలలను సందర్శించాలని తెలిపారు. తాను ఆకస్మికంగా పరిశీలి స్తామన్నారు.పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టిపెడితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. పాత గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు జడ్‌పి నిధులు కేటాయించాలన్నారు. పాత ఒంగోలు జిల్లా పరిధిలోని 13 మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో విద్యార్థులకు దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎపిఎంలు నాడు-నేడు పనులను పర్యవేక్షించాలన్నారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు సంక్షేమ సహాయకుడు, సచివాలయ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలన్నారు. నాడు- నేడు జిల్లా నోడల్‌ అధికారి, యద్దనపూడి ఎంఇఒ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి పనులకు కేటాయించిన సిమెంట్‌ పాడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు పది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మార్టూరు మండలంలో రూ.5 లక్షల బిల్లులను ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు అప్‌లోడ్‌ చేయటం లేదని ఎంఇఒ తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో డిఇఒ మాట్లాడారు. తన వద్ద పెండింగ్‌ లేదని ఎఇ ఫోన్‌లో సమాధానం చెప్పారు. తనను కలిసి వివరణ ఇవ్వాలని డిఇఒ రామారావు ఎఇకి సూచించారు.