ప్రజాశక్తి - ఆదోని
పాఠశాలలో ఏర్పాటు చేసిన స్మార్ట్ టివిలు, ఆర్‌ఒ ప్లాంట్, గదికి నాలుగు ఫ్యాన్లు, నాలుగు లైట్లు వంటి సౌకర్యాల కల్పించిన ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ కోసం గ్రాంట్స్ కూడా మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు బడుగు బసవరాజు కోరారు. శుక్రవారం ఆదోనిలోని అరబిక్ స్కూలులో సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి నెలా విద్యుత్ బిల్లు సుమారు రూ.2500, మెయింటనెన్స్ ఖర్చులు ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. పాఠశాల రీ ఓపెనింగ్ సమయానికంతా విడుదల చేయాల్సిన నిధులు ఇంకా మంజూరు చేయకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే పాఠశాల నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని, పాఠశాల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సురేష్ కుమార్, కోటన్న, ప్రతాప్ రెడ్డి, మద్దయ్య పాల్గొన్నారు.